ఢిల్లీని వణికించిన వాన..ఉదయం ఏకధాటిగా 5 గంటలపాటు కుండపోత

ఢిల్లీని వణికించిన వాన..ఉదయం ఏకధాటిగా 5 గంటలపాటు కుండపోత
  •     జలమయమైన రోడ్లు.. జనజీవనం అస్తవ్యస్తం
  •     చెరువులను తలపించిన పలు లోతట్టు ప్రాంతాలు
  •     26 విమానాలు రద్దు.. మరో 15 దారి మళ్లింపు
  •     గురుగ్రామ్‌‌‌‌లో వర్క్ ఫ్రమ్ హోమ్, స్కూళ్లకు ఆన్‌‌‌‌లైన్ క్లాసులు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటల మధ్య  (5 గంటలు) ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చెరువులను తలపించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. 

వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం.. జనక్‌‌‌‌పురిలో అత్యధికంగా 67 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. ఛతర్‌‌‌‌పూర్‌‌‌‌లో 57 మి.మీ, ఫరీదాబాద్‌‌‌‌లో 54 మి.మీ, గురుగ్రామ్‌‌‌‌లో 52 మి.మీ నుంచి 70 మి.మీ వరకు, పితంపురలో 35 మి.మీ, సఫ్దర్‌‌‌‌జంగ్‌‌‌‌లో 29 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, నోయిడా(యూపీ)లోని నూర్పూర్ చౌలాస్‌‌‌‌లో  గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8:30 వరకు)70 మి.మీ వర్షపాతం రికార్డయ్యింది. భారీ వర్షంతోపాటు ఆయా నగరాల్లో జరుగుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల వరద నీరు భారీగా రోడ్లపై నిలిచింది. సంగమ్ విహార్‌‌‌‌లో ప్రధాన రహదారి స్ట్రోమ్‌‌‌‌వాటర్ డ్రైనేజీ పనుల వల్ల, సదర్ బజార్‌‌‌‌లో జరుగుతున్న ఢిల్లీ మెట్రో నిర్మాణ పనుల వల్ల స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీనివల్ల సంగమ్ విహార్, సదర్ బజార్, న్యూ అశోక్ నగర్, ఘాజీపూర్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. 

ఆఫీసులకు వెళ్లే వేళల్లో రోడ్లపై నిలవడంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌‌‌‌లలో ఇరుక్కుపోయారు. నోయిడా నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించే ప్రయాణికుల ప్రయాణ సమయం రెట్టింపు అయ్యింది. అయితే, ఈ భారీ వర్షం వల్ల ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం వెలువడకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఈ సందర్భంగా వాతావరణ శాఖ(ఐఎండీ) ఢిల్లీకి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సఫ్దర్‌‌‌‌జంగ్‌‌‌‌లో ఆగస్టు నెలలో ఇప్పటివరకు ఏకంగా 246.2 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది. ఇది ఆగస్టు నెల సాధారణ సగటు 226.8 మి.మీ కంటే చాలా ఎక్కువ. పశ్చిమ యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్, మీరట్, ఘజియాబాద్‌‌‌‌లకు ఐఎండీ  ఆరెంజ్ అలర్ట్‌‌‌‌ జారీ చేసింది.

విమాన సర్వీసులకు బ్రేక్

భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం విమాన సర్వీసులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా మొత్తం 26 విమానాలను రద్దు చేయగా.. మరో 15 విమానాలను ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు దారి మళ్లించారు. దారి మళ్లించిన వాటిలో 3 ఇంటర్నేషనల్​ ఫ్లైట్లు కూడా ఉన్నాయి. దీనిపై ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పేస్‌‌‌‌జెట్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. మరోవైపు, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీ గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. 

గురుగ్రామ్ అతలాకుతలం

హర్యానాలోని గురుగ్రామ్ కూడా వర్షం దెబ్బకు పూర్తిగా అతలాకుతలమైంది. కేవలం గంటపాటు కురిసిన భారీ వర్షానికే గురుగ్రామ్ మౌలిక వసతులు కుప్పకూలిపోయాయి. రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, రైల్వే రోడ్డు, సెక్టార్ 5, ఓల్డ్ ఢిల్లీ రోడ్డు, మెహ్రౌలీ రోడ్డు, బసాయ్ రోడ్డు, శీతల మాత రోడ్డు పూర్తిగా జలమయమయ్యాయి. ఢిల్లీ, జైపూర్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేపై వాహనాలు నత్తనడకన సాగాయి. సిగ్నేచర్ టవర్ నుంచి హీరో హోండా చౌక్‌‌‌‌కు చేరుకోవడానికి సాధారణంగా పట్టే 15 నిమిషాల సమయం కాస్తా 50 నిమిషాలకు పైగా పట్టింది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తమ కార్లు, బైకులను రోడ్లపైనే వదిలిపెట్టి వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన గురుగ్రామ్ జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టింది. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. అలాగే, పాఠశాలలు ఆన్‌‌‌‌లైన్ విధానంలోనే తరగతులు నిర్వహించాలని స్పష్టంచేసింది.