నల్గొండ, వెలుగు: నల్గొండ కలెక్టరేట్‌లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలుచేయనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో మాట్లాడుతూ సమయపాలన, పారదర్శకతను పెంపొందించడంలో భాగంగా కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల్లో వాచ్‌మెన్ మొదలుకొని, అధికారి వరకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు చెప్పారు. అన్ని శాఖల ఉద్యోగులు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్‌లో నమోదు కావాలన్నారు.
ఇకపై ఈ అటెండెన్స్ ఆధారంగానే ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులు పాస్ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో వనమహోత్సవంలో భాగంగా సామూహికంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. రెండో విడుత ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా గుడిసెలు ఉన్నవారికి ప్రాధాన్యమవ్వాలన్నారు.
అనంతరం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కోసం రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్, అడిషనల్ కలెక్టర్లు జె.శ్రీనివాస్, ప్రేమ్ కరణ్ రెడ్డి, ట్రైనీ సహాయ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీవో శేఖర్ రెడ్డి, డీఆర్‌వో దశరథ్, తదితరులు ఉన్నారు.
