- నిర్మల్ జిల్లాలో ఇద్దరు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్లు..
- యాదాద్రి జిల్లాలో పట్టుబడిన ఆర్ఐ, జీపీవో
నిర్మల్/ఆలేరు (యాదాద్రి), వెలుగు : లంచం తీసుకున్న నలుగురు ఆఫీసర్లను సోమవారం ఏసీబీఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడగా, యాదాద్రి జిల్లా కొలనుపాక జీపీవో, ఆలేరు ఆర్ ఐ రూ. 14 వేలు తీసుకుంటూ దొరికారు.
వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల పట్టణంలోని శ్రీలక్ష్మీ ప్రసన్న జ్యువెల్లర్స్ రికార్డుల ఆడిట్ కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ రూ. లక్ష డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని జ్యువెల్లర్స్ యజమాని లక్కంశెట్టి వీర భాస్కర్ రావు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో రూ. 50 వేలకు ఒప్పుకున్నారు.
అనంతరం సదరు యజమాని ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో సోమవారం ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరిని కలిసి రూ. 50 వేలు ఇచ్చాడు. ఆమె ఆ డబ్బులను సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణకు ఇచ్చింది. అక్కడే ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరినీ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు.
యాదాద్రి జిల్లాలో ఆర్ఐ, జీపీవో
రైతు నుంచి లంచం తీసుకున్న యాదాద్రి జిల్లా కొలనుపాక జీపీవో, ఆలేరు ఆర్ఐని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూ పరిధిలోని ధర్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బొడిగె మహేశ్‌కు చెందిన భూ రిజిస్ట్రేషన్‌కోసం ఆలేరు ఆర్ ఐ వేముగంటి పూర్ణచందర్రావు విచారణ జరిపారు.
ఈ రిపోర్ట్ కోసం మహేశ్ ఆర్ఐని సంప్రదించగా.. ముందుగా రూ. 10 వేలు, తర్వాత రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మహేశ్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో రూ. 14 వేలు ఇస్తానని మహేశ్ చెప్పడంతో ఒప్పుకున్న ఆర్ఐ పూర్ణచందర్ రావు.. ఆ డబ్బులను కొలనుపాక జీపీవో షేక్అహ్మద్కు ఇవ్వాలని సూచించాడు.
దీంతో ఆలేరు, కొలనుపాక రోడ్డులో జీపీవో షేక్అహ్మద్ను కలిసి రూ. 14 వేలు ఇచ్చాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు షేక్ అహ్మద్ ను పట్టుకున్నారు. ఆర్ ఐ పూర్ణచందర్ రావు చెప్పినందునే తాను డబ్బులు తీసుకున్నానంటూ అహ్మద్చెప్పడంతో.. ఆర్ ఐని సైతం పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆర్ఐ ఇంటిలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపారు
