‘కుంభమేళా’ నిధుల్లో 0.1%తో 125 స్కూళ్లను కాపాడొచ్చు : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వరాలే

‘కుంభమేళా’ నిధుల్లో 0.1%తో 125 స్కూళ్లను కాపాడొచ్చు : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వరాలే

ధులే(మహారాష్ట్ర): నాసిక్ కుంభమేళాకు కేటాయించే బడ్జెట్‌‌‌‌లో 0.1 శాతం నిధులతో 125 మరాఠీ పాఠశాలలను కాపాడవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి. వరాలే పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఓ పాఠశాలలో ‘స్మార్ట్ క్లాసెస్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాసిక్ కుంభమేళాకు ఖర్చు చేసిన డబ్బుతో విద్యా బడ్జెట్ తగ్గిపోవడం, మరాఠీ పాఠశాలలు మూతపడటం వంటి విద్యా రంగంలోని దయనీయ పరిస్థితిని ఆయన ఎత్తిచూపారు. 

ప్రభుత్వం కుంభమేళా కోసం రూ.32 వేల కోట్ల నుంచి రూ.34 వేల కోట్ల వరకు, కారిడార్ల కోసం రూ.11 వేల కోట్లు కేటాయిస్తోందని ఆయన గుర్తుచేశారు. ఇందులో కేవలం 0.1 శాతం అంటే సుమారు రూ. 32 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన 100 నుంచి 125 మరాఠీ పాఠశాలలను కాపాడే అవకాశం ఉండేదని తెలిపారు. తాను మున్సిపల్, జిల్లా పరిషత్ మరాఠీ మీడియం పాఠశాలల్లోనే 10వ తరగతి వరకు చదువుకున్నానని, ప్రాంతీయ భాషలో చదవడం తన కెరీర్‌‌‌‌కు ఎప్పుడూ అడ్డుగా నిలవలేదని, పైగా తన దృక్పథాన్ని విశాలం చేసిందని ఆయన పేర్కొన్నారు.