హైదరాబాద్, వెలుగు: స్మాల్, మీడియం బిజినెస్‌లు(ఎస్ఎంబీలు) ఏఐ టెక్నాలజీతో ఎదుగుతున్నాయని వెల్లడయింది. కృత్రిమ మేధస్సు వీటి వ్యాపారాలకు ఎంతో సహాయపడుతోందని అమెజాన్ యాడ్స్ తెలిపింది. దీని స్టడీ రిపోర్ట్ ప్రకారం.. ఎస్ఎంబీలు ఏఐ టూల్స్ ద్వారా తక్కువ ఖర్చుతో యాడ్స్‌ను తయారు చేసుకుంటున్నాయి. కొత్త కస్టమర్లను చేరుకుంటున్నాయి.
ప్రకటనలను స్టడీ చేస్తూ, డబ్బు వృథా కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. 87 శాతం మంది వ్యాపారులు ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, టీవీ ప్రేక్షకులను సులభంగా చేరుకోగలుగుతున్నామని తెలిపారు. ఏఐ వల్ల బిజినెస్ పెరిగిందని 75 శాతం మంది చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఏఐ టూల్స్ వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది.
చిన్న వ్యాపార సంస్థలు పెద్ద బ్రాండ్లతో పోటీపడేలా ఏఐ టూల్స్ తయారు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ అడుగు పెట్టగలుగుతున్నాయి. రాబోయే కాలంలో డిజిటల్ ప్రకటనల రంగంలో ఏఐ పాత్ర మరింత కీలకం కానుందని అమెజాన్ యాడ్స్ రిపోర్ట్ వివరించింది.
