- వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత వెల్లడి
వరంగల్, వెలుగు: బార్ వద్ద జరిగిన గొడవలో టీజీఎస్పీ కానిస్టేబుల్‌పై దాడి చేసిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు కాగా.. అనంతరం అతడిపై లాఠీలతో విచక్షణరహితంగా దాడి చేసిన కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. ఈ నెల 19న హంటర్‌రోడ్ ఉర్సుగుట్ట కళింగ బార్ వద్ద కానిస్టేబుళ్ల మధ్య గొడవ జరిగింది.
మద్యం మత్తులో ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్ జువ్వాజీ మనోజ్.. విధుల్లో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ సంతోష్‌రెడ్డిపై చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు రావడంతో మనోజ్‌పై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్‌రెడ్డి మరో ఇద్దరితో కలిసి మనోజ్‌ను లాఠీలతో తీవ్రంగా కొట్టిన ఘటనను కూడా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారని డీసీపీ తెలిపారు.
లాఠీలతో కొట్టినా ఫిర్యాదు చేయని బాధితుడు..
గొడవ జరిగిన మరుసటి రోజు మనోజ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. తీవ్ర గాయాలైనప్పటికీ శాఖాపరమైన చర్యలకు భయపడి తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయలేదని సమాచారం. మరోవైపు సంతోష్‌రెడ్డి మాత్రం అదే రోజు రాత్రి 11 గంటలకు మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. కానీ సంతోష్‌రెడ్డి మాత్రం తన చెంపపై కొట్టి విధులకు ఆటంకం కలిగించాడంటూ మనోజ్‌పై ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సోమవారం డీసీపీ కవిత స్పందించారు. మనోజ్‌పై కేసు నమోదు చేసినప్పటికీ, అతడిపై లాఠీలతో దాడి చేసిన ఘటనను కూడా ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలిపారు.
