- ఎల్కతుర్తిలో కారులో యువతి డెడ్ బాడీ కేసును ఛేదించిన పోలీసులు
- మృతురాలు మానసకు రెండుసార్లు విడాకులు,
- ఎల్కతుర్తికి చెందిన వినోద్ కుమార్ తో వివాహేతర సంబంధం
- మాట వినడం లేదని పేరెంట్స్, పెండ్లి కోసం ఒత్తిడి చేస్తోందని ప్రియుడి కోపం
- మానస అడ్డుతొలగించాలన్న తండ్రి, హత్య చేసిన వినోద్ కుమార్
- ప్రియుడి అరెస్ట్.. పరారీలో మృతురాలి తండ్రి
ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద కారులో గుర్తించిన యువతి డెడ్ బాడీ మిస్టరీ వీడింది. రెండుసార్లు విడాకులు తీసుకున్న కూతురు తమ మాట వినకపోవడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తోందన్న కోపంతో యవతిని హత్య చేయాలని ఆమె తండ్రి చెప్పగా.. ప్రియుడు హత్య చేసి డెడ్ బాడీని కారులో వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల్లో ప్రియుడిని అరెస్ట్ చేయగా, హత్యకు ప్లాన్ చేసిన యువతి తండ్రి పరారీలో ఉన్నాడు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఎల్కతుర్తికి చెందిన మిల్కూరి సమ్మిరెడ్డి, కమలాపూర్ మండలానికి చెందిన అంకతి రాజేశం గతంలో సింగరేణి సంస్థలో పని చేశారు.
ఆ తర్వాత గోదావరిఖని సెంటినరీ కాలనీలోని పక్క పక్క ఇండ్లలో ఉండడంతో రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. రాజేశం కుమార్తె మానస(33)కు గతంలో రెండు సార్లు పెండ్లి జరగగా.. విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులతో ఉంటున్న మానస సమ్మిరెడ్డి చిన్న కొడుకు మిల్కూరి వినోద్ కుమార్ తో ప్రేమ కొనసాగిస్తోంది.
హత్యకు ప్రోత్సహించిన తండ్రి
మానస బయట తిరగడంతో పాటు కరీంనగర్ లోని వినోద్ కుమార్ దగ్గరికి వెళ్లి వస్తుండేది. తండ్రి రాజేశం ఎన్నిసార్లు చెప్పినా వినకపోగా వారితో గొడవ పడేది. వినోద్ కుమార్ తో ప్రేమలో ఉన్న మానస పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ నెల 16న అరుణాచలం వెళ్తున్నానని చెప్పిన మానస కరీంనగర్ లోని వినోద్ రూంకు వచ్చింది. 18న పెండ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో వినోద్ మానస తండ్రి రాజేశానికి ఫోన్ చేసి చెప్పాడు. 'మానస బతికి ఉంటే ఇద్దరినీ ఇబ్బంది పెడుతుంది.
ఏం చేస్తావో నీ ఇష్టం. ఆమె బాధ లేకుండా చెయ్' అని రాజేశం చెప్పడంతో వినోద్ అదే రోజు రాత్రి మానసను గొంతు పిసికి చంపేశాడు. తర్వాత డెడ్ బాడీని మూట కట్టి, కారు డిక్కీలో వేసుకొని 19న ఉదయం ఎల్కతుర్తికి చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటికి కొద్ది దూరంలోని ఖాళీ ప్రదేశంలో కారును పార్క్ చేశాడు.
డెడ్ బాడీని పాతిపెట్టేందుకు ప్లేస్, సమయం కోసం చూశాడు. కానీ అప్పటికే రెండు రోజులు గడిచిపోవడం, మృతదేహం కుళ్లిపోవడంతో దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు 21న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏమీ తెలియనట్టు యాక్టింగ్
కారులో డెడ్ బాడీ విషయం కలకలం రేపడంతో, ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు అంకతి మానసగా గుర్తించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తండ్రి రాజేశం, ఇతర కుటుంబ సభ్యులు ఎల్కతుర్తికి చేరుకున్నారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత రాజేశంను ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానమిచ్చాడు.
మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం సాయంత్రం ఎల్కతుర్తిలోని నాగార్జున సీడ్ ప్లాంట్ వద్ద వినోద్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. వినోద్ ను అరెస్ట్ చేసిన విషయం తెలియడంతో రాజేశం పరార్ అయ్యాడు. కేసును కరీంనగర్ -1 టౌన్ కు బదలాయించనున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ పులి రమేశ్, ఎస్సై నర్సింహారావు, హెడ్ కానిస్టేబుల్ విఠల్, కానిస్టేబుళ్లు భాస్కర్ రెడ్డి, బక్కయ్య, అఖిల్, సుమన్, నిరంజన్, మోహన్ బాబు, రాంలాల్, నీరజ్ ను ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు.
