హైదరాబాద్లో విషాదం.. కుప్పకూలిన సిటీ కాలేజీ పైకప్పు

హైదరాబాద్లో విషాదం.. కుప్పకూలిన సిటీ కాలేజీ పైకప్పు

చార్మినార్, వెలుగు: చారిత్రాత్మక ప్రభుత్వ సిటీ కాలేజీ పై కప్పు కారిడార్​కుప్పకూలింది. కాలేజీ మూడు ఫ్లోర్లతో ఉండగా, రెండో అంతస్థులోని ఫిజిక్స్ ల్యాబొరేటరీ, అప్లైడ్ న్యూట్రిషన్ కిచెన్ దగ్గర ఉన్న కారిడార్​కూలిపోయింది. ఆ టైంలో మొదటి అంతస్థులో క్లాసులు జరుగుతున్నాయి.

కాలేజీలో 5 వేల మంది స్టూడెంట్స్, టీచింగ్​, నాన్ ​టీచింగ్ ​స్టాఫ్​250 మంది వరకు ఉంటారు. ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 29 వరకు పాత బిల్డింగులో తరగతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఆన్‌‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు.

పోయిన ఏడాది వర్షా కాలంలో వాన నీళ్లు కురిసి ల్యాబ్ వరదతో నిండిపోయింది. దీంతో రెండు, మూడు రోజులపాటు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. అయినా దానికి రిపేర్ చేయకపోవడంతో ఈసారి మొత్తం కారిడార్ కూలిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

కాలేజీలో 60, 70 గదులుండగా ప్రతి రూమ్​లో పెచ్చులుడడం సర్వసాధారణమని, వర్షం పడినప్పుడు క్లాస్ రూమ్ గోడలు చెమ్మతో నిండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కాగా, విషయం తెలుసుకున్న చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ కాలేజీకి వచ్చి పరిశీలించారు. రిపేర్లు త్వరగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్​రెడ్డికి లెటర్​రాస్తానని హామీ ఇచ్చారు.

పైసలియ్యలే.. పనులు కాలే..
శిథిలావస్థకు చేరిన ఈ హెరిటేజ్​బిల్డింగ్​రిపేర్ల కోసం నిధులు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. భవనం దెబ్బతినడం, పైకప్పుల నుంచి నీళ్లు లీక్​అవుతుండడంతో నిపుణుల కమిటీ సర్వే చేసి, రూ. 13.72 కోట్ల అంచనాతో 2022లోనే ప్రపోజల్స్​ పంపింది. అయితే, ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోవడం, సరైన మెయింటనెన్స్​లేక రాను రాను బిల్డింగ్​బలహీనపడి కూలిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి.