గర్భాశయంలో చిన్న గడ్డను తొలగించుకునేందుకు సర్జరీ చేస్తే.. రక్తస్రావం జరిగి వివాహిత మృతి

గర్భాశయంలో చిన్న గడ్డను తొలగించుకునేందుకు సర్జరీ చేస్తే.. రక్తస్రావం జరిగి వివాహిత మృతి

పద్మారావునగర్, వెలుగు: గర్భాశయంలో ఏర్పడిన చిన్న గడ్డను తొలగించుకునేందుకు ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు వెళ్లిన ఓ వివాహిత మృతి చెందింది. డాక్టర్​నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబసభ్యులు దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన దివ్య(31), ఆమె భర్త వికాస్​ సంతానం కోసం ఏడాదిగా మారేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలోని బృందావన్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. దివ్య గర్భాశయంలో చిన్న గడ్డ ఏర్పడటంతో దాన్ని తొలగించేందుకు డాక్టర్ ​గీతాంజలి సోమవారం ఉదయం 8 గంటలకు ల్యాపరోస్కోపిక్​ ​సర్జరీ చేయగా.. తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో డాక్టర్​ అక్కడి నుంచి పరారయ్యారు.

ఆపరేషన్​ అనంతరం కుట్లు కూడా సరిగా వేయలేదని, తర్వాత చికిత్స అందించినా లాభం లేకుండా పోయిందని బాధితులు తెలిపారు. దివ్య మృతికి డాక్టర్​ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ హాస్పిటల్​ఎదుట ఆందోళనకు దిగారు.  దవాఖాన అద్దాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. 

తుకారాం గేట్ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్​ అయింది. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. డాక్టర్లు గీతాంజలి, శ్రీకాంత్​లపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.