మేడారం జాతర కానుకల క్వాలిటీ చెకింగ్.. 17 జాతరల్లో పోగైన బంగారం, వెండి లెక్కింపు షురూ

మేడారం జాతర  కానుకల క్వాలిటీ చెకింగ్.. 17 జాతరల్లో పోగైన బంగారం, వెండి లెక్కింపు షురూ
  • 32 ఏండ్ల తర్వాత స్వచ్ఛత పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు
  • నివేదిక తర్వాత ఆభరణాలపై ప్రభుత్వం నిర్ణయం

వరంగల్‌‌, వెలుగు: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలపై దేవాదాయ శాఖ తొలిసారి పూర్తిస్థాయి తనిఖీలకు శ్రీకారం చుట్టింది. 1994 నుంచి 2026 వరకు 17 జాతరల్లో హుండీల్లో భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారు, వెండి ఆభరణాలను లెక్కించి, వాటి స్వచ్ఛతను నిర్ధారించనున్నారు. 

దీంతో ఇప్పటివరకు బాక్సుల్లో భద్రపరిచిన కానుకల్లో అసలు బంగారం, వెండి ఎంత ఉందో తొలిసారిగా తేలనుంది. 2022 జాతరలో 631 గ్రాముల మిశ్రమ బంగారు ఆభరణాలు, 48 కిలోల 350 గ్రాముల వెండి, 2024లో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల వెండి, 2026లో 486 గ్రాముల బంగారం, 31 కిలోల 700 గ్రాముల వెండి భక్తులు సమర్పించారు. 

ఈ మూడు జాతరల్లోనే భారీగా కానుకలు వస్తే.. 17 జాతరల్లో మొత్తం ఎంత బంగారం, వెండి సమకూరిందనేది ఇప్పటివరకు అధికారికంగా తెలియదు. ప్రస్తుత మార్కెట్‌‌లో బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటి విలువ కూడా కోట్లలో ఉండే అవకాశం ఉంది.

1994 నుంచే భద్రత..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరను అప్పటి ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అయితే 1994 నుంచే జాతర ఏర్పాట్లతో పాటు హుండీల్లోని కానుకల లెక్కింపు, భద్రతను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. 

ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో భక్తులు సమర్పించే నగదు, నాణేలు, విదేశీ కరెన్సీ, బియ్యంతో పాటు బంగారు, వెండి ఆభరణాలను లెక్కించి ఐరన్‌‌ బాక్సుల్లో భద్రపరుస్తున్నారు. 2026 జాతర నాటికి 17 జాతరల్లో భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలను ఆయా బాక్సుల్లో ఉంచి దేవాదాయ శాఖ ట్రెజరీలో భద్రపరిచారు.

ఒక్కో జాతర బాక్స్‌‌ ఓపెన్‌‌ చేసి..

సమ్మక్క–సారలమ్మ ధార్మిక భవన్‌‌లో సోమవారం స్వచ్ఛత పరీక్షలు, లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దేవాదాయ శాఖ జ్యువెల్లరీ వెరిఫికేషన్‌‌ అధికారి అంజనీదేవి పర్యవేక్షణలో డిప్యూటీ కమిషనర్‌‌ రామల సునీత, మేడారం జాతర ప్రధాన పూజరుల సంఘం బాధ్యులు జగ్గారావు తదితరులతో కూడిన కమిటీ ఈ ప్రక్రియ చేపట్టింది.

 శాఖ ట్రెజరీ నుంచి భారీ భద్రత మధ్య కానుకలను ధార్మిక భవన్‌‌కు తరలించారు. ఒక్కో జాతరకు సంబంధించిన బాక్స్‌‌ను తెరిచి గతంలో నమోదు చేసిన వివరాలతో సరిపోల్చనున్నారు. అనంతరం బంగారం, వెండి ఆభరణాల స్వచ్ఛతను పరీక్షించి అసలు బంగారం, వెండి పరిమాణాన్ని నిర్ధారిస్తారు.

విలువ ఎంత?.. ఏం చేస్తారు?

17 జాతరల్లో లభించిన సొక్కం బంగారం, వెండి ఎంత అనేది లెక్కించిన తర్వాత ప్రస్తుత మార్కెట్‌‌ ధరల ఆధారంగా వాటి మొత్తం విలువను కూడా అంచనా వేయనున్నారు. నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌‌ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. అనంతరం ఆభరణాలను కరిగించాలా, ఆలయ అభివృద్ధికి వినియోగించాలా, పూజరులకు వాటా ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.