- ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెనక్కి తీసుకోవాలి
- రీచార్జ్ అయిపోతే వెంటనే కరెంటు కట్ అయితుందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి వేల కోట్లు కొల్లగొట్టిన అధికారుల గుట్టు బయట పెట్టారు సరే.. ఆ అవినీతిపరులను వెనుక ఉండి ప్రోత్సహించిన వాళ్ల సంగతి ఏంటని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ప్రశ్నించారు. అధికారులను ముందు పెట్టి రూ.వేల కోట్లు దోచుకుంటున్న వారి నుంచి ఆ అవినీతిని సొమ్ము కక్కించే వాళ్లు ఎవరని సోమవారం ఒక ప్రకటనలో ప్రశించారు. “ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతితో వేల కోట్లు కొల్లగొడుతున్న వారి సంగతి ఏంటి? వాళ్ల అక్రమాలను వెలుగులోకి తెచ్చేవారు లేరా? అధికారులను మాత్రమే అవినీతికి బాధ్యులను చేస్తూ వారిని అడ్డుపెట్టుకొని వ్యవస్థలను దోపిడీ చేస్తున్న వారిని కట్టడి చేయాల్సిన వాళ్లు ఎవరు? తమకు మంచి చేస్తారని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే భవిష్యత్ తరాలకు చెందాల్సిన సంపదను కొల్లగొడుతున్న వారిని చూస్తూ ఊరుకోవాలా?” అని ఆమె ప్రశ్నించారు.
ఉచిత కరెంట్‌ను ఎత్తివేసే కుట్ర
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందు రేవంత్ రెడ్డి సర్కారు మోకరిల్లిందని కవిత ఆరోపించారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత కరెంట్‌ను ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన పవర్ ఎక్స్ పో – 2026ను సందర్శించి అక్కడ ప్రదర్శనకు ఉంచిన స్మార్ట్ మీటర్లను కవిత పరిశీలించి, మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంట్‌ను దూరం చేయడంతో పాటు లాండ్రీ షాపులు, సెలూన్లకు ఫ్రీ కరెంట్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
గతంలో వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం సర్కారు చేసిందన్నారు. అదానీకి లాభం చేయడానికి కేంద్రం స్మార్ట్ మీటర్లు తెస్తుంటే రేవంత్ సర్కారు దానికి వంత పాడుతోందన్నారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని ఇటీవల ట్రాన్స్ కో సీఎండీ చెప్పారని గుర్తుచేశారు. రీచార్జ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు ఇండ్లలో కరెంట్ కట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడున్న మీటర్లతోనే కరెంట్ సరఫరా చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
