ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహుకు జాతీయ అవార్డు

ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహుకు జాతీయ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహుకు కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. నేషనల్ టీచర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు (హెచ్‌‌‌‌‌‌‌‌ఈఐ), పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన 21 మంది అధ్యాపకులకు కేంద్ర విద్యాశాఖ ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026’ ప్రకటించింది. 

ఈ 21 మందిలో కేంద్ర ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 12 మంది, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ఐదుగురు, పాలిటెక్నిక్ కాలేజీల నుంచి నలుగురు ఉన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల విభాగంలో మూడు ప్రభుత్వ, రెండు ప్రైవేట్ కాలేజీల అధ్యాపకులను ఎంపిక చేశారు. పాలిటెక్నిక్ కాలేజీల నుంచి ఇద్దరు ప్రభుత్వ, ఇద్దరు ప్రైవేట్ కాలేజీల అధ్యాపకులకు అవార్డులు దక్కాయి. అధ్యాపకుల బోధనా సామర్థ్యం, విస్తరణ కార్యక్రమాలు, పరిశోధనలు, ఆవిష్కరణలు, ఫ్యాకల్టీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లు, కన్సల్టెన్సీ టీచింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.