- రూ.2 లక్షల విలువైన సొత్తు మాయం
షాద్‌నగర్, వెలుగు: దొంగతనం చేసి పారిపోవడం కాదు.. ఇంట్లోనే మందు, ముక్క లాగించి ఎంజాయ్ చేశారు ముగ్గురు దొంగలు. షాద్‌నగర్‌లోని సీఎస్‌కే విల్లాస్‌లో ఈ ఘటన జరిగింది. విల్లా టౌన్‌షిప్‌లో నివసించే నక్కల యశోద మహబూబ్‌నగర్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లారు.
ఇదే అదనుగా భావించిన ముగ్గురు దొంగలు ఆదివారం అర్ధరాత్రి విల్లా గోడ దూకి ఇంటి వెనుక ఉన్న గ్రిల్స్‌ను గడ్డపారతో తొలగించి లోపలికి చొరబడ్డారు. బీరువాలు తెరిచి రూ.లక్ష నగదు, ఐఫోన్, వాచ్, ఖరీదైన టీషర్టులు, విదేశీ మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. మొత్తం రూ.2 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపారు.
ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ముందుగా వంటగదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న మాంసాన్ని వండుకొని, ఇంట్లోనే మందు, మటన్ లాగించారు. ఆ తర్వాత దర్జాగా చోరీ చేసిన సొత్తును మూటగట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు బాధితులు తెలిపారు. షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
