మహబూబ్‌నగర్ కలెక్టరేట్, వెలుగు: ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్ పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లో నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లపై పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో భద్రత, విద్యుత్, ఇంటర్నెట్, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ తదితర అంశాలపై రివ్యూ చేశారు.
జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 360 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వనమహోత్సవం కార్యక్రమంపై రివ్యూ చేశారు. సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, డీఆర్‌వో నిర్మల, డీఎస్పీ(ఎస్బీ) రమణారెడ్డి, బల్దియా కమిషనర్ ఎ.రామానుజులరెడ్డి, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డీఎంహెచ్‌వో శ్రీనివాసులు పాల్గొన్నారు.
నేటి నుంచి వనమహోత్సవం
సూర్యాపేట, వెలుగు: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు.
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను వార్డులు, గ్రామాల వారీగా నాటేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో ఫారెస్ట్ ఆఫీసర్ దామోదర్‌రెడ్డి, జడ్పీ సీఈవో శిరీష, డీఆర్‌డీవో పీడీ సన్యాసయ్య, అధికారులు పాల్గొన్నారు.
