జీవో 97ను రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్

జీవో 97ను రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: స్కిల్ డెవలప్‌‌మెంట్, ఉపాధి పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, కార్యదర్శి టి. నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అడ్డుకుని దోమలగూడ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌‌లో నిరసన చేసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. దేశమంతా రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి.. తెలంగాణలో ఆయన పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్న విషయం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.  

ఏబీవీపీ ధర్నా..

రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను యథాతథంగా కొనసాగించాలని, లాటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నేతలు సోమవారం ఎస్‌‌బీటీఈటీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు.