ఆమ్‌స్టెల్విన్ (నెదర్లాండ్స్): ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియా మెన్స్ జట్టు నిరాశపర్చింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 3–5 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడింది. సుఖ్‌జీత్ సింగ్ (10, 58వ నిమిషం), హార్దిక్ సింగ్ (59వ ని) ఇండియాకు రెండు గోల్స్ అందించగా, అర్జెంటీనా తరఫున జోక్విన్ టోస్కాని (1వ ని), నికోలస్ డెల్లా టోర్రే (6వ ని), టోమాస్ డోమెన్ (33, 45వ ని), లుకాస్ టోస్కాని (53వ ని) గోల్స్ కొట్టారు.
ఈ టోర్నీలో సెమీస్ చేరాలంటే ఇండియా కనీసం మూడు గోల్స్ తేడాతో విజయం సాధించాల్సి ఉంది. కానీ మ్యాచ్ ఆరంభంలోనే రెండు గోల్స్ ఇచ్చుకుని కోలుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. పేలవమైన పాసింగ్, తరచుగా బంతిపై పట్టు కోల్పోవడం, బలహీనమైన డిఫెన్స్‌తో చాలా ఇబ్బందిపడింది.
మ్యాచ్ చివర్లో రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసినా.. అప్పటికే చాలా ఆలస్యమైంది. తాజా ఓటమితో ఇండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే పూల్–ఈలో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఏడు, ఎనిమిది స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్ ఆడనుంది.
అర్జెంటీనా 39వ సెకండ్‌లోనే గోల్ చేసి ఇండియాపై ఒత్తిడి పెంచింది. 3వ నిమిషంలో సర్కిల్ లోపల జర్మన్‌ప్రీత్ సింగ్ చేసిన పొరపాటు అర్జెంటీనాకు తొలి పెనాల్టీ కార్నర్‌ను అందించింది. 6వ నిమిషంలో బంతి అర్జెంటీనా స్ట్రయికర్ స్టిక్‌కు తగిలి యశ్‌దీప్‌కు తగలడంతో వాళ్లకు మరో పెనాల్టీ కార్నర్ లభించింది.
దానిని నికోలస్ గోల్‌గా మార్చాడు. తర్వాత 10వ నిమిషంలో సుఖ్‌జీత్ గోల్ కొట్టి ఆధిక్యాన్ని 1–2కు తగ్గించాడు. రెండో క్వార్టర్‌లో ఏ జట్టూ గోల్ చేయలేదు. ఇండియా కొన్ని అవకాశాలను సృష్టించుకున్నప్పటికీ గోల్స్‌గా మలచలేదు. సెకండాఫ్‌లో మరింత దూకుడుగా ఆడిన అర్జెంటీనా పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసింది.
