విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి సప్లై

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి సప్లై
  • అబిడ్స్లో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన మైనర్ అరెస్ట్

అబిడ్స్, వెలుగు: విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ మైనర్‌‌‌‌‌‌‌‌ను అబిడ్స్​ ​పోలీసులు సోమవారం అరెస్ట్​ చేశారు. రూ.24.50 లక్షల విలువైన 48 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను హైదరాబాద్ సిటీ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడించారు.

ఇంటర్మీడియట్ చదివి బ్లింకిట్ డెలివరీ బాయ్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న బిహార్​కు చెందిన ఈ మైనర్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో చిన్ననాటి మిత్రుడు అంకిత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ అక్రమ రవాణాకు పాల్పడ్డాడు.

విశాఖపట్నంలో నౌషద్, రాజేశ్​ల వద్ద కొనుగోలు చేసిన గంజాయిని 24 ప్యాకెట్లుగా చేసి బ్రీఫ్‌‌‌‌‌‌‌‌ కేసులు, ఎయిర్ బ్యాగ్‌‌‌‌‌‌‌‌లలో నింపి ఢిల్లీకి తరలిస్తుండగా.. నాంపల్లి స్టేషన్ రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులైన ఢిల్లీకి చెందిన బండియా, విశాఖకు చెందిన నౌషద్, రాజేశ్, బిహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన అంకిత్ కుమార్ పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.