బెల్లంపల్లి సీవోఈలో సబ్జెక్ట్ టీచర్ల కొరతపై స్టూడెంట్ల ఆగ్రహం..గోడ దూకి బయటకు వచ్చిన 35 మంది విద్యార్థులు

బెల్లంపల్లి సీవోఈలో సబ్జెక్ట్ టీచర్ల కొరతపై స్టూడెంట్ల ఆగ్రహం..గోడ దూకి బయటకు వచ్చిన 35 మంది విద్యార్థులు
  • హైదరాబాద్ వెళ్లేందుకు అర్ధరాత్రి 
  • గోడ దూకి బయటకు వచ్చిన 35 మంది 
  •  హాస్టల్​కు తరలించిన పోలీసులు 
  • ఫ్యాకల్టీని నియమించిన విషయం తెలియకే బయటికొచ్చారన్న ప్రిన్సిపాల్

బెల్లంపల్లి రూరల్, వెలుగు : సబ్జెక్ట్ టీచర్స్ కొరతపై మంత్రి, ఆఫీసర్లను కలవాలన్న ఉద్దేశంతో పలువురు స్టూడెంట్లు అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. గమనించిన వార్డెన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్టూడెంట్లకు నచ్చజెప్పి హాస్టల్ కు పంపించారు.

 ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సెంటర్​ఆఫ్​ఎక్స్​లెన్స్(సీవోఈ)లో సోమవారం జరిగింది. బెల్లంపల్లి సీవోఈలో ఫిజిక్స్, జువాలజీ సబ్జెక్టు టీచర్లతో పాటు జేఈఈ బోధించే ఫ్యాకల్టీని నియమించకపోవడంతో చదువులు ఇబ్బందిగా మారాయి. 

ఈ విషయంపై జిల్లా ఆఫీసర్లను కలిసినా ఫలితం లేకపోవడంతో స్టూడెంట్లు మూకుమ్మడిగా హైదరాబాద్ కు వెళ్లి మంత్రి, అధికారులను కలవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి 35 మంది స్టూడెంట్లు హాస్టల్ గోడ దూకి బయటకు వచ్చారు. 

బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ​కు చేరుకొని భాగ్యనగర్ ఎక్స్​ప్రెస్​ద్వారా హైదరాబాద్​కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. విద్యార్థులు బయటకు వెళ్లిన విషయం తెలుసుకున్న వార్డెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు రైల్వేస్టేషన్​కు చేరుకొని, స్టూడెంట్స్​తో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చి వారిని తిరిగి హాస్టల్​కు తరలించారు.

 ఈ విషయంపై ప్రిన్సిపాల్​విజయ్​కుమార్​ను సంప్రదించగా.. సబ్జెక్ట్ టీచర్స్ ను నియమిస్తూ శనివారమే ఆర్డర్స్​వచ్చాయని, వారు సోమవారం ఉదయం జాయిన్​అయ్యారని తెలిపారు. ఈ విషయం తెలియకనే విద్యార్థులు బయటకు వచ్చారని చెప్పారు.