వరంగల్‌ లో ఎంటెక్‌‌ స్టూడెంట్ చోరీల బాట..పగలు రెక్కీ.. రాత్రిపూట దొంగతనాలు

వరంగల్‌ లో ఎంటెక్‌‌ స్టూడెంట్ చోరీల బాట..పగలు రెక్కీ.. రాత్రిపూట దొంగతనాలు
  •     నిందితుడు అరెస్ట్​.. రూ.12 లక్షల ఆభరణాలు స్వాధీనం

వరంగల్‌‌/కరీమాబాద్‌‌, వెలుగు: ఎంటెక్‌‌ చదివి ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటుపడిన వ్యక్తిని వరంగల్‌‌ కమిషనరేట్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి, రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిపై ఇప్పటికే 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

సోమవారం వరంగల్‌‌ సెంట్రల్‌‌ జోన్‌‌ డీసీపీ దార కవిత పోలీస్‌‌ హెడ్‌‌క్వార్టర్స్‌‌లో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లికి చెందిన రెడ్డిమల్ల ఆశిష్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి(27) ఎంటెక్‌‌ చదివాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌‌లో ఉంటున్నాడు. 

సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు అలవాటయ్యాడు. ఉదయం వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. రాత్రివేళల్లో ఆయా ఇళ్లను టార్గెట్‌‌ చేసి చోరీ చేసేవాడు. 2024, 2025లో మహారాష్ట్రలో నాలుగు చోరీలు చేసి పోలీసులకు చిక్కాడు. జైలుకు వెళ్లి బయటకు వచ్చినా తీరు మారలేదు. అనంతరం మంచిర్యాల ప్రాంతంలోనూ చోరీలకు ప్రయత్నించాడు. 

ఇటీవల వరంగల్‌‌ నగరానికి వచ్చిన ఆశిష్‌‌.. మిల్స్‌‌ కాలనీ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలోని శివనగర్‌‌, ఎస్‌‌ఆర్‌‌ఆర్‌‌ నగర్‌‌ ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌‌ చేశాడు. రెండు రోజుల్లోనే వరుసగా ఆరు చోరీలకు పాల్పడ్డాడు. 

సీసీఎస్‌‌, మిల్స్‌‌ కాలనీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. సోమవారం అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆశిష్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీసీఎస్‌‌, మిల్స్‌‌ కాలనీ ఇన్‌‌స్పెక్టర్లు రామకృష్ణ, స్వామి, ఎస్సై మహేశ్‌‌, ఏఏఓ సల్మాన్‌‌ను సీపీ శ్వేత అభినందించారు.