హెచ్1బీ వీసా, ఓపీటీకు కొత్త ఫీజులు..ప్రతిపాదనలు సిద్ధం చేసిన అమెరికా

హెచ్1బీ వీసా, ఓపీటీకు కొత్త ఫీజులు..ప్రతిపాదనలు సిద్ధం చేసిన అమెరికా
  •     ఓపీటీ ఫీజు 96 లక్షలకు పెంచే అవకాశం
  •     గతంలో హెచ్‌‌‌‌1బీ వీసా ఫీజును  లక్ష డాలర్లకు పెంచిన డొనాల్డ్​ ట్రంప్‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌: హెచ్-1బీ వర్క్ వీసా, ఎఫ్-1 ఓపీటీ(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రోగ్రాంలకు ఫీజులను నిర్ణయించేందుకు అమెరికా సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను యూఎస్‌‌‌‌ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రూపొందిస్తోందని న్యూయార్క్‌‌‌‌కు ఇమ్మిగ్రేషన్ న్యాయ సంస్థ ఫ్రాగొమెన్ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై సమీక్ష జరుగుతోందని, అమెరికా ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. ఫీజుల మొత్తం ఎంత ఉండబోతోందనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే, ఓపీటీ దరఖాస్తులకు ఏకంగా లక్ష డాలర్లు(రూ.95 లక్షలు) వరకు ఫీజు విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం ఇంకా ఖరారు కాలేదని, మీడియా అంచనాలు మాత్రమేనని ఫ్రాగొమెన్ స్పష్టం చేసింది.

ఆగస్టు 20న ఓపీటీ ప్రతిపాదనపై సమీక్ష

ఓపీటీకి సంబంధించిన కొత్త ఫీజు ప్రతిపాదన ఆగస్టు 20న ఓఎంబీ పరిశీలనకు వెళ్లినట్లు ఫ్రాగొమెన్ తెలిపింది. హెచ్‌‌‌‌1బీ వీసాల ఫీజు లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ట్రంప్‌‌‌‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై గతంలోనే కొంతమంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. 

ఈ నేపథ్యంలో హెచ్‌‌‌‌1బీ వీసాల ఫీజుకు సంబంధించిన ప్రతిపాదనను కూడా ఓఎంబీ  ఆగస్టు 19న సమీక్షించి క్లియర్ చేసినట్లు ఫ్రాగొమెన్‌‌‌‌ పేర్కొంది. ఈ రెండు ప్రతిపాదనల వివరాలు ప్రస్తుతం గోప్యంగా ఉన్నాయి. దీంతో కొత్త ఫీజులు ఎంత ఉంటాయన్న దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు.