సాధారణ పెట్రోల్/డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా... ఈ రోజుల్లో చాలామంది పెట్రోల్, డీజిల్ కార్లను వదిలేసి ఎలక్ట్రిక్ వాహనాలు (EV) కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ ఖర్చులు ఆదా అవుతాయనేది నిజమే అయినా, ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణ కార్ల కంటే వేరేలా ఉంటాయి. సమాచారం ప్రకారం రెండింటికీ కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరే అయినా, ప్రీమియం ధరలు, కవరేజ్ విషయంలో పెద్ద తేడాలు ఉన్నాయి.
ఈ తేడాలలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే :
స్పేర్ పార్ట్స్
పెట్రోల్/డీజిల్ కార్లలో ఇంజిన్, గేర్‌బాక్స్, ట్రాన్స్‌మిషన్ భాగాలు కీలకమైనవి. ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత ఖరీదైన భాగం హై-వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్. కారు మొత్తం ధరలో 40% నుండి 50% వరకు కేవలం బ్యాటరీదే ఉంటుంది. దీనితో పాటు ఎలక్ట్రిక్ మోటార్, సెన్సార్లు, ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ ఖరీదైనవి కావడం వల్ల ఇన్సూరెన్స్ కవరేజ్ విలువ పెరుగుతుంది.
రిపేర్ ఖర్చులు
సాధారణ కార్లును లోకల్ గ్యారేజీలో సాధారణ మెకానిక్స్ ఈజీగా రిపేర్ చేయగలరు. EV కార్లలో హై-వోల్టేజ్ సిస్టమ్ ఉన్నందున వీటిని రిపేర్ చేయడానికి ప్రత్యేక ట్రైనింగ్ పొందిన టెక్నీషియన్లు, లేటెస్ట్ టూల్స్ అవసరం. సర్వీసింగ్ ఇంకా పార్ట్స్ రీప్లేస్‌మెంట్ కాస్ట్లీ కావడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు EVల నుండి కొంత ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయి.
ఛార్జింగ్ డివైజెస్
సాధారణ కార్లకి ఇంధనం నింపే ట్యాంక్ కారులోనే ఉంటుంది, విడిగా ఎలాంటివి ఉండవు. EV కార్లతో పాటు ఖరీదైన పోర్టబుల్ ఛార్జర్లు, ఛార్జింగ్ కేబుల్స్, హోమ్ ఛార్జింగ్ సెటప్ వస్తాయి. ప్రమాదంలో ఇవి పాడైనా లేదా దొంగతనానికి గురైనా పాలసీలో కవర్ కాకపోవచ్చు. వీటి కోసం ప్రత్యేకంగా యాడ్-ఆన్ (Add-on) తీసుకోవాలో లేదో చెక్ చేసుకోవాలి.
ALSO READ : Onida కాదు, BPL కాదు... మన దేశంలో తయారైన మొట్టమొదటి టీవీ ఏదో తెలుసా?
ఐడీవీ (IDV) అండ్ ప్రీమియం ధరలు
సాధారణ కార్లు ఐడీవీ (Insured Declared Value - కారు మార్కెట్ విలువ), ఇంజిన్ సీసీ (cc), క్లెయిమ్ హిస్టరీ ఆధారంగా ప్రీమియం ఉంటుంది. EV కార్ల కొనుగోలు ధర (IDV) ఎక్కువగా ఉండటం, బ్యాటరీ విలువ ఇంకా రిపేర్ ఖర్చు కారణంగా EV ఇన్సూరెన్స్ ప్రీమియం సాధారణ కార్ల కంటే 10% నుండి 20% వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ కవరేజ్
ప్రమాదాలు లేదా రోడ్డు ప్రమాదంలో కారు బ్యాటరీ పాడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లభిస్తుంది. కానీ సాధారణ వాడకంతో బ్యాటరీ ఛార్జింగ్ సామర్థ్యం తగ్గడం (Degradation) ఇన్సూరెన్స్ కిందకి రాదు. ఇది కంపెనీ ఇచ్చే వారంటీ కిందకి మాత్రమే వస్తుంది.
EV ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
* మీ ఛార్జింగ్ కేబుల్స్ దొంగతనం అయినా లేదా పాడైనా క్లెయిమ్ వచ్చేలా యాడ్-ఆన్ తీసుకోండి.
*EV కొనేటప్పుడు జీరో డెప్రిసియేషన్ (Zero Dep) & బ్యాటరీ ప్రొటెక్ట్.. ఈ రెండు యాడ్-ఆన్లు ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ఇది బ్యాటరీ రీప్లేస్‌మెంట్ సమయంలో మీ జేబు నుండి డబ్బులు ఖర్చు కాకుండా చూస్తుంది.
*చౌకైన ఇన్సూరెన్స్ వద్దు: కేవలం ప్రీమియం తక్కువగా ఉందని సరైన కవరేజ్ లేని పాలసీ తీసుకోవద్దు. రేపు బ్యాటరీ సమస్య వస్తే ఖర్చు చాలా భారమవుతుంది.
