Nick Maddinson: ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించి సరిగ్గా పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన ఓపెనర్ నిక్ మాడిసన్ (Nic Maddinson) రీఎంట్రీ మ్యాచ్‌లో ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాతో కింగ్స్‌మీడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్సింగ్స్‌లో నిక్ మాడిసన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కానీ, అతను ఆడిన తీరు టెస్టు క్రికెట్‌లో ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకునేలా చేసింది.
ఆసీస్ తరఫున చెత్త రికార్డు.. 33 బంతులు ఆడి డకౌట్:
దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ వేసిన 11వ ఓవర్లో నిక్ మాడిసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులో కుదురుకోవడానికి సుమారు 33 బంతులు ఎదుర్కొన్న అతడు, ఒక్క పరుగు కూడా చేయకుండానే (డకౌట్) వెనుదిరిగాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గా అత్యధిక బంతులు ఆడి డకైన రికార్డు ఇప్పుడు మాడిసన్ పేరుపైకి చేరింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (2022 యాషెస్ సిరీస్‌లో 22 బంతుల డక్) పేరిట ఉండేది. ఇక టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక బంతులు ఆడి డకౌటైన ప్రపంచ రికార్డు మాత్రం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డారిన్ ముర్రే (1995లో శ్రీలంకపై 39 బంతుల డక్) పేరిట కొనసాగుతోంది.
అదృష్టం కలిసొచ్చినా సద్వినియోగం చేసుకోలే:
ఇన్నింగ్స్ ఆరంభంలో నిక్ మాడిసన్ సహనంతో ఆడుతూ కొన్ని బంతులను వదిలేశాడు. నాలుగో ఓవర్లో వియాన్ ముల్డర్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. కానీ, సౌతాఫ్రికా ప్లేయర్లు బంతి బ్యాట్‌కు తాకిందో లేదోనన్న అనుమానంతో రివ్యూ కోరకపోవడంతో మాడిసన్ బతికిపోయాడు. అయితే, కొద్దిసేపటికే మార్కో జాన్సన్ బౌలింగ్‌లో వెనుదిప్పక తప్పలేదు.
88 టెస్టులకు దూరం.. క్యాన్సర్‌పై అద్భుత పోరాటం:
* చివరిసారిగా డిసెంబర్ 2016లో పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడిన నిక్ మాడిసన్.. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య కాలంలో ఏకంగా 88 టెస్టు మ్యాచ్‌లను కోల్పోయాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఇది కూడా ఓ రికార్డే.
* 2025 ఏప్రిల్‌లో వృషణ క్యాన్సర్ (Testicular cancer) బారిన పడిన మాడిసన్.. ఊపిరితిత్తులు, శోషరస కణుపులకు వ్యాధి సోకడంతో తీవ్రమైన కీమోథెరపీ చికిత్స తీసుకున్నాడు.
ALSO READ : 2027 వరల్డ్ కప్‌లో హార్దిక్ ఆడాలంటే బ్యాటింగ్ ఒక్కటే సరిపోదు
* జూలై 2025 నాటికి చికిత్స పూర్తి చేసుకుని, అద్భుతంగా తిరిగి రావడంతో సెప్టెంబరులో మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. దేశవాళీ టోర్నీల్లో రాణించడం, ఆస్ట్రేలియా జట్టులో గాయాల సమస్యలు తలెత్తడంతో సెలెక్టర్లు అతనికి పిలుపునిచ్చారు.
* వ్యక్తిగతంగా పరుగులు రాకపోయినా, క్యాన్సర్‌ను ఓడించి మైదానంలో అడుగు పెట్టడమే గొప్ప విషయమని క్రీడాభిమానులు ఆయనను కొనియాడుతున్నారు.
Nick Maddison Gone For A 33 Ball Duck Marco Jansen Strikes 😮💨🔥 https://t.co/4Mx0qaWlGQ
— Cricket Dani (@CricketDani56) October 9, 2026
