Vijay Deverakonda: నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బలుపులా అనిపిస్తే.. నేను తగ్గాలా ఎట్లా?.. నెగిటివిటీపై విజయ్ దేవరకొండ ఫైర్

Vijay Deverakonda: నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బలుపులా అనిపిస్తే.. నేను తగ్గాలా ఎట్లా?.. నెగిటివిటీపై విజయ్ దేవరకొండ ఫైర్

‘రణబాలి’ ట్రైలర్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగిటివిటీపై ఆసక్తికరంగా స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీపై అసహనం వ్యక్తం చేశారు. “సోషల్ మీడియాలో విజయ్ మీద ఇంత నెగిటివిటీ ఎందుకు? చాలా మంచోడబ్బా.. ఎవరి ఊసూ ఎత్తడు. దయచేసి ఆ నెగిటివిటీని మనసులో నుంచి తీసేయండి” అంటూ ఆయన కోరారు.

అదే సమయంలో ఓ జర్నలిస్ట్ విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి.. “చాలా తక్కువ సమయంలోనే సాలిడ్ సక్సెస్ సాధించారు. అదే సమయంలో సోషల్ మీడియాలో పూర్తిగా నెగిటివిటీని కూడా ఎదుర్కొంటున్నారు. మీపై వస్తున్న కామెంట్స్‌ను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది?” అని ప్రశ్నించారు. దీనికి విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో స్ట్రాంగ్‌గా సమాధానం ఇచ్చారు.

“నా కలలు, నా నిజాయితీ వాడికి అనవసరం అనిపిస్తే.. నేను ఆగాలా? నా నిజాయితీ, నా హానెస్టీ వాడికి అగ్రెషన్‌లా అనిపిస్తే.. నేను నటించాలా? నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాడికి బలుపులా అనిపిస్తే.. నేను తగ్గాలా? నా అలుపెరగని జర్నీ వాడికి అరగకపోతే.. నేను ఇంట్లో కూర్చోవాలా? నేను అస్సలు ఆగను. నెగిటివిటీ ట్రోల్ చేసే వాళ్లే ఆగాలి” అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. తనపై వస్తున్న నెగిటివిటీ మొత్తం సహజంగా వస్తున్న హేట్ కాదని విజయ్ అభిప్రాయపడ్డారు. “ఇది నా మీద హేట్ అని అనలేం. 90 శాతం కావాలని చేసే ఓ గ్రూప్ పని. ఒక 50 మంది కూర్చుని.. ఒకరు 20 అకౌంట్లు, మరొకరు 1000 అకౌంట్లు క్రియేట్ చేసుకుని చేసే పని ఇది” అని అన్నారు.

ముఖ్యంగా ‘రణబాలి’ సినిమాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా విజయ్ ప్రస్తావించారు. ట్రైలర్ విడుదల కాకముందే “ఇది బ్రిటిష్ సినిమా.. తెలుగు సినిమా కాదు.. ఇలాంటి సినిమాలను ఎవరు చూస్తారు?” అంటూ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టులు, రీల్స్ వైరల్ అవుతున్నాయని తెలిపారు. “అసలు ట్రైలరే రాకుండా ఇలాంటి అభిప్రాయానికి వస్తున్నారంటే అర్థం చేసుకోండి” అంటూ విజయ్ అన్నారు. అదే సమయంలో అక్టోబర్ 15న విడుదల కానున్న ‘జైలర్’ సినిమాకు వెళ్దాం.. ‘రనబలి’ బొక్క అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

“ఒపీనియన్ ఎవరికైనా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ 50 రీల్స్ ఒకే విధంగా కమ్యూనికేట్ అవుతున్నాయంటే.. ఎవడో కూర్చుని ఇది కావాలని చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఇలాంటిది ఇప్పుడు ప్రతి రంగంలోనూ జరుగుతోంది” అంటూ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పందించారు. మొత్తంగా తనపై వచ్చే ట్రోల్స్, నెగిటివిటీని పట్టించుకోకుండా ముందుకు సాగుతానని విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.