క్యాన్సర్ పేషెంట్లకు, బాధితుల కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో కొన్ని క్యాన్సర్ మందుల ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
క్యాన్సర్ మందుల విషయంలో రిటైలర్లకు లభించే ధరకు (PTR), ఎంఆర్‌పి (MRP) మధ్య భారీ తేడాలు ఉండటంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రిటైల్ ప్రైస్ రూ. 2 వేల 700 లకు లభించిన మందులకు.. కస్టమర్ల వరకు వచ్చే వరకు దాదాపు 27,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ గ్యాప్ కారణంగా బాధితులు తీవ్రంగా నష్టపోతున్నట్లు సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కొన్ని రకాల క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధర (MRP) 70 శాతం వరకు తగ్గనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు ఏటా సుమారు రూ. 25 వందల కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
బ్రాండెడ్, జెనెరిక్, దేశీయ, దిగుమతి చేసుకున్నవి అలాగే పేటెంట్ కలిగినవి, అన్ని నాన్-షెడ్యూల్డ్ యాంటీ-క్యాన్సర్ మందులకు ఈ క్యాప్ వర్తిస్తుంది.
