ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సాగునీటి కోసం సెప్టెంబర్ 19న జూరాల ప్రాజెక్టు దగ్గర కొందరు రైతులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.
అధికారులు స్పందించకపోవడంతో ఎడమ కాలువ గేట్లు ఎత్తి రైతులే నీటిని విడుదల చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 14 మంది రైతులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇరిగేషన్ డీఈ ఫిర్యాదుతో పోలీసులు రైతులపై చర్యలు తీసుకున్నారు.
జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ గేట్ను రైతులు బలవంతంగా తెరిచి పంట కాలువకు నీటిని విడుదల చేసుకోవడంతో పోలీసులు, ఇరిగేషన్ ఆఫీసర్లు విస్తుపోయారు. వెంటనే తెరిచిన గేట్లను మూసి వేశారు. జూరాల ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల గేట్ల దగ్గర ఆ సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని రైతులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పంటలకు సాగునీరు ఇచ్చేందుకు సరిపడా నీళ్లు జూరాల ప్రాజెక్టులో లేకపోవడంతో నీటి విడుదల కష్టమని అధికారులు స్పష్టం చేశారు.
