కేసీఆర్ ఫామ్ హౌజ్ పక్కనే సర్వే నంబర్ 325.. ఆ 45 ఎకరాల లెక్క తేలాల్సి ఉంది: మంత్రి వివేక్

కేసీఆర్ ఫామ్ హౌజ్ పక్కనే సర్వే నంబర్ 325..  ఆ 45 ఎకరాల లెక్క తేలాల్సి ఉంది: మంత్రి వివేక్

కేసీఆర్ ఫామ్ హౌజ్ పక్కనే సర్వే నంబర్ 325 ఉందని.. ఫామ్ హౌజ్ సమీపంలో ప్రజలు సర్వే కోరుకుంటున్నారని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి  అన్నారు.  ఆ 45 ఎకరాల లెక్క తేలాల్సి ఉందన్నారు. 2026 అక్టోబర్ 8న ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా.. సిద్ధిపేటలో ఇందిరా మహిళా శక్తి, కళ్యాణ లక్ష్మి షాదిముబరక్ చెక్ ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరికి వారు సొంత ఖర్చులతో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నారని అన్నారు.  పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించుకున్నారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమానికి ముందు 20 ఎకరాలు ఉండేదని అన్నారు.  పాండురంగ చెరువు ఎందుకు తవ్వించారని ప్రశ్నించారు. ప్రభుత్వ డబ్బులతో వారి భూములకు పైప్ లైన్ వేసుకున్నారని ఆరోపించారు. దానిపై విచారణ చేపట్టమని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ కు నీళ్లు వచ్చాయని.. స్థానిక రైతులకు సాగు నీరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసిఆర్ కుటుంబ ఆస్థుల గురించి పూర్తి విచారణ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే కార్యచరణ తీసుకుందని.. అవసరమైతే నోటీసులు ఇస్తుందని చెప్పారు. సర్వే నంబర్ 325 పై అపోహలు ఉన్నాయని.. దీని పై పూర్తి విచారణ చెపడతామని తెలిపారు. అక్కడ దళితులకు భూములు ఇవ్వాలని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 

దసరా పండుగకు ఇందిరమ్మ చీరలు :

దసరా పండుగకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి వివేక్ చెప్పారు . కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తినీ పెంచాలని యోచిస్తోందని అన్నారు. మహిళల కు పెట్రోల్ పంపులు, బస్ లు, ఇందిరమ్మ క్యాంటీన్ లు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు టిఫిన్స్ పెడుతున్నాం.. ప్రతి ఇంటి కి 200 యూనిట్ ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. గతం లో 3 వేల 300 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రెండో విడతగా మరో 2 వేల 500 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 10 వేల టీచర్ పోస్టులు భర్తీచేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎల్ నినో వళ్ల తీవ్ర కరువు ఉంటుందని, ప్రపంచ వ్యాప్తంగా ఈ కరువు ఉంటుందని అన్నారు. కానీ ప్రతి పక్షాలు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిందలు వేస్తుయని అన్నారు. వచ్చే ఏడాది వరకు ఈ ఎల్ నినో ప్రభావం ఉంటుందని..  తాగు నీటికి ఎలాంటి కరువు రావొద్దని నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.