రెడ్‌ జోన్‌లో ప్రాజెక్టులు.. డెడ్‌ స్టోరేజ్‌కు చేరువలో ప్రధాన రిజర్వాయర్లు

రెడ్‌ జోన్‌లో ప్రాజెక్టులు.. డెడ్‌ స్టోరేజ్‌కు చేరువలో ప్రధాన రిజర్వాయర్లు

 

  • శ్రీశైలంలో మిగిలింది 21 టీఎంసీలు.. ఇప్పటికీ రోజూ అర టీఎంసీ డ్రా
  •     సాగర్‌‌‌‌‌‌‌‌లో 55 టీఎంసీల లభ్యత    శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌లో 31 టీఎంసీలే
         లోయర్​, మధ్య మానేరు జలాశయాలదీ అదే పరిస్థితి
  •     ఎండాకాలం దాకా నీటిని పొదుపుగా వాడుకోవాలని నిపుణుల సూచన


హైదరాబాద్, వెలుగు:చలికాలం మొదలే కాలేదు..  ఎండా కాలం దగ్గర్లో లేదు.. కానీ  ప్రాజెక్టుల్లో డేంజర్​బెల్స్​ మోగుతున్నాయి. ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌తో వర్షాల్లేక తాగునీటికి ఆధారమైన అన్ని రిజర్వాయర్లలో నీటిమట్టాలు అట్టడుగుకు పడిపోతున్నాయి. అటు కృష్ణా, ఇటు గోదావరి బేసిన్‌‌‌‌లోని ప్రధాన డ్యాములన్నీ దాదాపు ‘రెడ్ జోన్’ (డెడ్ స్టోరేజ్)కు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతుండగా, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరాయి. శ్రీశైలంలో కేవలం 21 టీఎంసీలు, నాగార్జున సాగర్‌‌‌‌లో 55 టీఎంసీల మేర మాత్రమే వాడుకోవడానికి వీలుంది. 


ఉత్తర తెలంగాణకు కీలకమైన శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ), లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ)ల్లోనూ డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎండాకాలం ప్రారంభం వరకే తాగునీటికీ తిప్పలు మొదలయ్యేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు.

శ్రీశైలంలో ఇంకో 20 టీఎంసీలే..

కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టుల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో డెడ్​స్టోరేజీకి ఎగువన 20 టీఎంసీల నీళ్లే వాడుకునే వీలుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 75.31 టీఎంసీల నీళ్లే నిల్వ ఉన్నాయి. ప్రాజెక్ట్​ డెడ్​స్టోరేజీ 53.85 టీఎంసీలుకాగా.. కేవలం 21.46 టీఎంసీలు వాడుకునే వీలుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుకోవడం లేదు. కానీ ఏపీ ఇప్పటికే  50 టీఎంసీల వరకు నీటిని ఒక్కపోతిరెడ్డిపాడు ద్వారానే మళ్లించుకున్నది. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు నుంచి వెయ్యి క్యూసెక్కులు.. మల్యాల లిఫ్ట్​ నుంచి 3,050 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తున్నది. కల్వకుర్తి నుంచి మన రాష్ట్రం 2,400 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నది.  ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి దాదాపు అర టీఎంసీ వరకు నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇదే తరహాలో నీటిని డ్రా చేస్తే.. మరో నెల..నెలన్నరలో ప్రాజెక్ట్​ డెడ్​స్టోరేజ్​ దిగువకు జారిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంత బెటర్ అయినా..

నాగార్జునసాగర్​ ప్రాజెక్టులో పరిస్థితి కొంచెం బెటరే అయినా.. ఎండాకాలం వరకు ఆ నీళ్లుంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకుగానూ 186.25 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రాజెక్ట్​ డెడ్​స్టోరేజ్​131.67 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం డెడ్​స్టోరేజ్‌‌‌‌‌‌‌‌కు ఎగువన మరో 55 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రస్తుతం ఏఎమ్మార్పీ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని డ్రా చేస్తున్నారు. ఇటు హైదరాబాద్​, అటు ఉమ్మడి నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. ఈ నీళ్లను ఎండా కాలం వరకు పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్ట్​ డెడ్​స్టోరేజ్​ లెవెల్​ 510 అడుగులే కావడం.. దానికన్నా తక్కువకు ప్రాజెక్టు పడిపోతే మనకు నీళ్లు వాడుకునే పరిస్థితి ఉండకపోవడం కొంత ఆందోళన కలిగిస్తున్నది. ఎల్‌‌‌‌‌‌‌‌నినో టైం కావడంతో ఎండాకాలం వరకు ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ప్రశ్న వినిపిస్తున్నది. 510 అడుగుల దిగువకు పడిపోతే మోటార్లు పెట్టి ఎత్తుకునే పరిస్థితి వస్తుందన్న ఆందోళన నెలకొన్నది.

గోదావరిలోనూ అదే సీన్​..

గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌లోనూ దాదాపు ఇదే సీన్​ కనిపిస్తున్నది. ఈ ఏడాది అత్యంత తీవ్రంగా ప్రభావితమైనది మాత్రం శ్రీరాంసాగర్​ ప్రాజెక్టే. ఈ ఏడాది ఆ ప్రాజెక్టుకు వచ్చిన వరద చాలా తక్కువ. ఇప్పటివరకూ కేవలం 40 టీఎంసీల ఫ్లడ్‌‌‌‌‌‌‌‌ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 80 టీఎంసీలకుగానూ.. 46 టీఎంసీల నీళ్లున్నాయి. డెడ్​స్టోరేజ్​ 14.77 టీఎంసీలు పోనూ వాడుకోవడానికి ఉన్నది కేవలం 32 టీఎంసీలే. ఇటు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది. 20.18 టీఎంసీలకుగానూ.. 18 టీఎంసీల నీళ్లున్నాయి. లోయర్​ మానేరులో పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నది. 24.03 టీఎంసీలకుగానూ కేవలం 15 టీఎంసీలే ఉన్నాయి. డెడ్​స్టోరేజ్ కుపైన మరో 13 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. మిడ్​మానేరులో డెడ్​స్టోరేజ్‌‌‌‌‌‌‌‌కు పైన 17 టీఎంసీల నీళ్లున్నాయి.