సంగారెడ్డి, వెలుగు: ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ నిర్మల సంగారెడ్డి అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం రాత్రి 10 గంటల నుంచి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల ఓటు హక్కు కోసం రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ పోరాటం కొనసాగినంత కాలం తమ దీక్ష సైతం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు.
సింగూరు నీటిని పొదుపుగా వాడుకోవాలి
మంజీరా, సింగూరు నీటిని తాగునీటి అవసరాల కోసం జాగ్రత్తగా వినియోగించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో తాగునీరు, కరెంట్సమస్యలపై బుధవారం ఆయన ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు 29 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం సుమారు 3 టీఎంసీల నీరు మాత్రమే ఉందని ఆఫీసర్లు తెలిపారు. దసరా తర్వాత రోజు విడిచి రోజు నీటిని విడుదల చేయనున్నట్లు మిషన్ భగీరథ ఎస్ఈ వెల్లడించారు. నీటి కొరతపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని జగ్గారెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఇటీవల నీటిని విడుదల చేయడంపై స్పందించిన ఆయన డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల మేరకే మరమ్మతుల కోసం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా, ప్రెషర్, బోర్లు, పశువులకు తాగునీరు, విద్యుత్ బ్రేక్‌డౌన్ల సమస్యలపై కూడా చర్చించారు.
