హర్మన్‌ కెప్టెన్సీ అద్భుతం.. స్మృతి మంధాన ప్రశంసలు

హర్మన్‌ కెప్టెన్సీ అద్భుతం.. స్మృతి మంధాన ప్రశంసలు

ముంబై: భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పదేళ్ల సారథ్యాన్ని కొత్త కెప్టెన్‌ స్మృతి మంధాన ప్రశంసించింది. హర్మన్‌ప్రీత్‌ మంగళవారం అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. ఆమె నాయకత్వం అద్భుతంగా సాగిందని మంధాన పేర్కొంది. ‘‘ఇన్నేళ్లుగా నీతో కలిసి ఆడటం ఎంతో ఆనందంగా ఉంది. పది ఏళ్ల నీ నాయకత్వం అద్భుతం. మన దేశానికి మరిన్ని విజయాలు అందించేందుకు కలిసి కృషి చేద్దాం’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో భారత జట్టు 2025 నవంబర్‌లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచింది.

2023, 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. ఇక అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా మంధాన ఈ నెలలో జింబాబ్వేతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లతో పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనుంది. జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌, శ్రేయా చరణి, రేణుకా సింగ్‌ ఠాకూర్‌ కూడా హర్మన్‌ప్రీత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె అందించిన మార్గదర్శకత్వం, స్ఫూర్తిని కొనియాడారు. మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా సైతం హర్మన్‌ నాయకత్వాన్ని ప్రశంసించాడు.కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ హర్మన్‌ప్రీత్‌ భారత జట్టులో కొనసాగనుంది. జింబాబ్వే సిరీస్‌ కోసం ప్రకటించిన రెండు జట్లలోనూ ఆమెకు చోటు దక్కింది.