‘ఇందిరా మహిళా శక్తి భవనాలు’ ప్రారంభానికి సిద్ధం..‘ఎక్స్‌‌‌‌’ లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్

‘ఇందిరా మహిళా శక్తి భవనాలు’ ప్రారంభానికి సిద్ధం..‘ఎక్స్‌‌‌‌’ లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీ) మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లాల వారీగా నిర్మించిన ‘ఇందిరా మహిళా శక్తి భవనాలు’ ప్రారంభానికి ముస్తాబయ్యాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. మహిళా సోదరీమణుల ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు ఈ భవనాలు సరికొత్త నిలయాలుగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. 

ఈ కేంద్రాల ద్వారా శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల తయారీ నుంచి గ్లోబల్ మార్కెట్లలో విక్రయాల వరకు అవసరమైన ప్రతి అవకాశాన్ని ఒకే వేదికపై అందించే కీలక కేంద్రాలుగా ఇవి నిలుస్తాయని వెల్లడించారు. ‘‘మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి’’ అనే ఆశయంతో రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఒక ఆడబిడ్డకు సరైన అవకాశం లభిస్తే, ఆ కుటుంబ భవిష్యత్తే మారుతుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.