- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అంశాన్ని కోర్టులో తేల్చుకోండి
- కేసీఆర్ భూ వివాదాలపై కాంగ్రెస్ డ్రామా
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: దేశంలో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు ఉన్నాయని గతంలో కాంగ్రెస్ పార్టీయే చెప్పిందని, వాటిని తొలగిస్తుంటే అభ్యంతరం ఎందుకని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఓట్చోరీ, సీట్చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ కే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో బుధవారం సేవా జ్యోతి పేరుతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప సభ జరిగింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వర్చువల్ గా ప్రసగించి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అనంతరం కేంద్ర మంత్రి సంజయ్ మీడియాతో మాట్లాడారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినప్పుడు దేశంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలన్నీ పటేల్ పేరు ప్రతిపాదించాయని, కానీ ఒక్క పీసీసీ మద్దతు కూడా లేని నెహ్రూను ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ దేనని విమర్శించారు.
ప్రధాని మోదీకి ఓట్, సీట్ చోరీకి పాల్పడాల్సిన కర్మ పట్టలేదన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థ కానేకాదని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అంశాన్ని కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ ఈసీని ఎప్పుడైనా కలవొచ్చని, అపాయింట్ మెంట్ తీసుకోకుండా వందల మందితో వెళ్తే అడ్డుకోక ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే 30 వేలకుపైగా రోహింగ్యాల ఓట్లున్నాయని తెలిపారు. కేసీఆర్ భూ వివాదాలపై కాంగ్రెస్ డ్రామా ఆడుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతి కుమార్, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
