ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. రెండ్రోజులు వైన్స్ బంద్

ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. రెండ్రోజులు వైన్స్ బంద్

SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలు కీలక మలుపు తిరిగాయి. ఈ ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వైన్ షాపుల మూసివేతకు దారితీశాయి.

ఢిల్లీలో శుక్రవారం (అక్టోబర్ 9), శనివారం (అక్టోబర్ 10) మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శనివారం జంతర్ మంతర్ దగ్గర 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో.. ఢిల్లీలో శనివారం మద్యం దుకాణాలు బంద్.

శాంతిభద్రతలను కాపాడే లక్ష్యంతో, ఢిల్లీ పోలీసుల సూచన మేరకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఎల్6, ఎల్6ఎఫ్జీ, ఎల్8, ఎల్10, ఎల్14 మరియు ఎల్8, ఎల్14 లైసెన్సుల క్రింద పనిచేస్తున్న అన్ని రిటైల్ మద్యం దుకాణాలు రాబోయే రెండు రోజుల పాటు మూసివేయబడతాయని తెలిపింది. అయితే.. మద్యం విక్రయించడానికి ఎక్సైజ్ లైసెన్సులు పొందిన హోటళ్లు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు మాత్రం తెరిచే ఉంటాయి.

“ఓట్ల దొంగతనం” ఆరోపణలపై జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం జంతర్ మంతర్ దగ్గర కూడా నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పటికే 20 వేల మందికి పైగా పోలీసు, పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. జంతర్ మంతర్ దగ్గర నిరసనలకు అనుమతి ఇవ్వలేదని, అనధికారిక నిరసనల్లో, ఆందోళనల్లో పాల్గొనవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.