- భారత్ జోడో అభియాన్ నేషనల్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కౌలు రైతుల కు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని భారత్ జోడో అభియాన్ నేషనల్ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. 2011 సాగుదారుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. కౌలు రైతుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారే ఉన్నారని, వారికి హక్కులు కల్పించడం సామాజిక న్యాయంలో భాగమని పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో చర్చించి రూపొందించిన గుర్తింపు ప్రక్రియ నోట్‌తో పాటు 55 గ్రామాల్లో నిర్వహించిన సర్వే నివేదికను డిప్యూటీ సీఎంకు అందజేశారు. కౌలు రైతుల డిమాండ్ సమంజసమైనదని అంగీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఈ అంశంపై సీఎంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
