- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారా?
- ఈ ఏడాది నుంచి ఫీజులు అడ్వాన్స్‌గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నం
- అధికారంలోకి రాగానే హాస్టళ్ల మెస్ చార్జీలు పెంచామని వెల్లడి
కరీంనగర్/చిగురుమామిడి, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదేండ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెడితే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని, అప్పుడు దీక్షలు ఎందుకు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ‘‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లెపల్లెలో ప్రజాపాలన’’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండలం నవాబుపేటలో సోమవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాంచందర్ రావు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బీజేపీలో లొల్లులు ఎక్కువయ్యాయని, దాంతో ఉనికి కాపాడుకోవడానికి ఆయన దీక్షల డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను తీసుకురావాలని సవాల్ విసిరారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ చానెల్ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మిస్తున్నామని, తాము అధికారంలోకి రాగానే మెస్ చార్జీలు పెంచి విద్యార్థులకు కడుపు నిండా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తున్నామని అన్నారు.
