బ్రిటన్‌‌ పార్లమెంట్‌‌కు చండూరు ఇక్కత్.. అంతర్జాతీయ వేదికపై అరుదైన గుర్తింపు

బ్రిటన్‌‌ పార్లమెంట్‌‌కు చండూరు ఇక్కత్.. అంతర్జాతీయ వేదికపై అరుదైన గుర్తింపు
  •     తెలియా రుమాల్‌‌, ఇక్కత్‌‌ ను పరిచయం చేయనున్న రష్మి ఠాకూర్‌‌

చండూరు, వెలుగు: నల్గొండ జిల్లా చండూరు చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కనుంది. త్వరలో బ్రిటన్‌‌ పార్లమెంట్‌‌లో నిర్వహించనున్న ప్రత్యేక సదస్సులో చండూరుకు చెందిన ప్రసిద్ధ తెలియా రుమాల్‌‌, ఇక్కత్‌‌ వస్త్రాల ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు నేషనల్‌‌ హ్యాండ్లూమ్‌‌ బ్రాండ్‌‌ అంబాసిడర్‌‌, మిస్‌‌ ఆసియా రష్మి ఠాకూర్‌‌ తెలిపారు.

 సోమవారం ఆమెతో పాటు టీటీడీ వస్త్రాల కమిటీ చైర్మన్‌‌, తెలంగాణ హ్యాండ్లూమ్స్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కమిషనర్‌‌ ఎస్‌‌.అరుణ్‌‌కుమార్‌‌, పద్మశ్రీ, జాతీయ చేనేత అవార్డు గ్రహీత గజం అంజయ్య చండూరులో పర్యటించారు.

మగ్గాలపై తయారీ పరిశీలన..

చండూరుకు చేరుకున్న ప్రముఖులకు చేనేత కార్మికులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు శ్రీ మార్కండేశ్వర దేవాలయం వద్ద పూర్ణకుంభం, వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. 

అనంతరం స్థానిక మగ్గాల వద్దకు వెళ్లిన వారు చీరలు, తెలియా రుమాళ్లు, ఇక్కత్‌‌ వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి నూలు తయారీ, రంగులు, డిజైన్లు, వస్త్రాల నాణ్యత తదితర వివరాలను తెలుసుకున్నారు.

తెలియా రుమాల్‌‌ తో హాజరుకానున్న రష్మి ఠాకూర్​..

బ్రిటిష్‌‌ పార్లమెంట్‌‌లో త్వరలో జరగనున్న ప్రత్యేక సదస్సుకు తనకు ఆహ్వానం అందిందని రష్మి ఠాకూర్‌‌ తెలిపారు. చండూరుకు చెందిన తెలియా రుమాల్‌‌ ధరించి ఆ కార్యక్రమానికి హాజరై 
చండూరు చేనేత ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతానన్నారు. 

అంతర్జాతీయ ర్యాంప్‌‌వాక్‌‌లో తాను ధరించిన ఇక్కత్‌‌ గౌన్‌‌కు విశేష ఆదరణ లభించిందని, అదే స్థాయిలో చండూరు ఇక్కత్‌‌కు గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. హ్యాండ్లూమ్స్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కమిషనర్‌‌ ఎస్‌‌. అరుణ్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చండూరు చేనేత కార్మికుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానన్నారు.

 చండూరుకు చెందిన చిలుకూరి శ్రీనివాస్‌‌ తయారు చేస్తున్న వస్త్రాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వరస్వామి అలంకరణకు వినియోగించడం ఈ ప్రాంతానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌‌ చైర్మన్‌‌ కోడి శ్రీనివాసులు, చేనేత సహకార సంఘం చైర్మన్‌‌ పున ధర్మేందర్‌‌, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.