గినియా దేశంలో ఘోర విషాదం.. చెత్తగుట్ట కూలి 30 మంది మృతి

గినియా దేశంలో ఘోర విషాదం.. చెత్తగుట్ట కూలి 30 మంది మృతి

కొనాక్రీ: గినియా రాజధాని కొనాక్రీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భారీ చెత్త గుట్ట కూలి ఇండ్లపై పడడంతో 30 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. కొనాక్రీ శివార్లలోని బెస్సియా జిల్లా దార్ ఎస్-సలామ్ పరిసరాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్థానికంగా ఉన్న ఓ చెత్త గుట్ట ప్రమాదకరంగా మారిందని, సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అక్కడి గుడిసెల్లో ఉంటున్న వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో కొంతమంది అక్కడి నుంచి వెళ్లిపోగా, చాలామంది అక్కడే ఉండిపోయారు. 

ఈ క్రమంలో ఆదివారం రాత్రి 2 గంటలకు చెత్త గుట్ట ఒక్కసారిగా కింద ఉన్న గుడిసెలపై కూలింది. చెత్త కప్పేయడంతో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఎక్స్‌‌‌‌కవేటర్ల సాయంతో డెడ్‌‌‌‌బాడీలను సిబ్బంది వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకొని గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్స్‌‌‌‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు 18 డెడ్‌‌‌‌బాడీలను వెలికితీశామని, ఈ ఘటనలో చాలా గుడిసెలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఆదివారం ఈ చెత్త గ్రౌండ్‌‌‌‌ను మూసివేయాలని నిర్ణయించామని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.