- అన్ని దేశాల కన్నా ఇండియాలోనే ఖర్చు ఎక్కువ
- కేంబ్రిడ్జ్, ఇటలీ వర్సిటీ రీసెర్చర్ల సంచలన నివేదిక
- భారత్‌లో లాంచింగ్ కాస్ట్ కిలో పేలోడ్‌కు రూ. 12.73 లక్షలుగా అంచనా
- అమెరికాలో రూ.3.08 లక్షలు, చైనాలో రూ.5.56 లక్షలు అని వెల్లడి
- స్టడీ రిపోర్ట్‌ను తోసిపుచ్చిన ఇస్రో.. ఈ డేటా, అంచనా పద్ధతి తప్పుగా ఉందని స్పష్టం
లండన్: ప్రపంచంలోనే అతి చవకగా రాకెట్ ప్రయోగాలను చేపట్టే అంతరిక్ష సంస్థగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఎంతో పేరు ఉంది. కానీ, ఒక కిలో పేలోడ్‌ను అంతరిక్షానికి పంపేందుకు అయ్యే ఖర్చును బట్టి చూస్తే.. యావరేజ్‌గా ఇస్రో చేపట్టే రాకెట్ ప్రయోగాల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికమని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఇటలీలోని పాలిటెక్నికో డీ టొరినో యూనివర్సిటీ రీసెర్చర్లు చెప్తున్నారు.
భారత్‌తో పాటు అమెరికా, చైనా, రష్యా, తదితర దేశాల అంతరిక్ష సంస్థల ప్రయోగాల ఖర్చును పరిశీలించి ఈ మేరకు సంచలన నివేదికను విడుదల చేశారు. పాలిటెక్నికో డీ టొరినో, కేంబ్రిడ్జ్ వర్సిటీ ఎకనమిస్ట్‌లు ఫ్రాన్సెస్కో నికోలి, అలేసియో టెర్జీ కలిసి రూపొందించిన ఈ రీసెర్చ్ పేపర్ ‘జర్నల్ ఎకనామిక్స్ లెటర్స్’లో ఇటీవల పబ్లిష్ అయింది. ఈ స్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. దిగువ భూ కక్ష్య(లో ఎర్త్ ఆర్బిట్)లోకి కిలోగ్రాము పేలోడ్ చేరవేయడానికి అయ్యే ఖర్చును వీరు అంచనా వేశారు.
ఇందుకోసం ప్రధానంగా1960 నుంచి 2025 మధ్యకాలంలో జరిగిన 6,740కి పైగా రాకెట్ ప్రయోగాలను విశ్లేషించారు. 2025లో భారత్ రాకెట్ ప్రయోగాల ఖర్చు కిలోగ్రాముకు 13,302 డాలర్లు (సుమారు రూ. 12,73,000)గా ఉన్నట్టుగా అంచనా వేశారు.
అమెరికాలో ఇది కిలోకు 3,225 డాలర్లు (సుమారు రూ. 3,08,600)గా, జపాన్‌లో 5,287 డాలర్లు(సుమారు రూ. 5,06,000)గా, చైనాలో 5,809 డాలర్లు (సుమారు రూ.5,56,000)గా, రష్యాలో 6,682 డాలర్లు (సుమారు రూ. 6,39,500)గా, యూరప్ లో 9,897 డాలర్లు (సుమారు రూ. 9,47,100)గా ఉన్నట్టుగా పేర్కొన్నారు. ప్రపంచ సగటు కిలోగ్రాముకు 3,868 డాలర్లు (సుమారు రూ.3,70,100)గా నమోదు చేశారు.
ఖర్చు ఎక్కువ.. పేలోడ్ తక్కువ..
తక్కువ ఖర్చుతో కూడిన ఇంజనీరింగ్‌కు ఇస్రో పేరుగాంచిన నేపథ్యంలో ఈ స్టడీలోని భారత్ గణాంకాలు వాస్తవ విరుద్ధంగా అనిపించవచ్చని రీసెర్చర్లు తెలిపారు. అయితే, భారత్ వద్ద చిన్న లాంచ్ వెహికల్స్ ఉండటం, చిన్న పేలోడ్‌లను పంపటం వల్ల ఖర్చు ఎక్కువ, పేలోడ్ బరువు తక్కువగా ఉంటున్నాయని.. ఫలితంగా కిలోగ్రాముకు అయ్యే అంచనా ఖర్చును పెంచుతోందని వారు పేర్కొన్నారు.
అమెరికాలో రాకెట్ ప్రయోగాలకు తక్కువ ఖర్చు కావడానికి.. రాకెట్ మొదటి స్టేజ్‌లను మళ్లీ మళ్లీ వాడటం, ఎక్కువ ప్రయోగాలు చేయడం, దీర్ఘకాలిక మౌలికవసతుల కల్పనతోపాటు ప్రయోగాల్లో క్రమంగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ ఉండటమే కారణమని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు.
రాంగ్ డేటాతో అంచనా వేశారు: ఇస్రో చైర్మన్
రాకెట్ ప్రయోగాల ఖర్చు అంచనాకు ఈ స్టడీలో వినియోగించిన డేటా, ఎంచుకున్న పద్ధతి తప్పని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ స్పష్టం చేశారు. ఒక కిలోగ్రాము పేలోడ్‌ను పంపేందుకు అయ్యే ఖర్చు ప్రయోగం మొత్తం ఆర్థిక అంశాలను ప్రతిబింబించదని ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ కూడా తేల్చిచెప్పారు.
