వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వార్‌లో యూఎస్ ఆర్మీ దాదాపు 3.3 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.32 వేల కోట్లు) నష్టపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) రిపోర్టు ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అగ్రరాజ్యానికి చెందిన 81 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు దెబ్బతిన్నాయి. వీటిలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలైన ఎఫ్-35ఏ లైట్నింగ్ 2 స్టెల్త్ ఫైటర్, 12 ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్లు, 7 కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు.2 ఏ-10 థండర్‌బోల్ట్ 2 గ్రౌండ్-అటాక్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి.
ఒక్కొక్కటి రూ.289 కోట్ల విలువైన నాలుగు ఎఫ్15 జెట్‌లు, 45 ఎంక్యూ 9 రీపర్ డ్రోన్లు (ఒక్కొక్కటి 30 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్ల విలువైనవి ) సైతం ధ్వంసమయ్యాయి. మార్చి 2న కువైట్‌లో మూడు ఎఫ్ -15 జెట్లు కూలిపోయాయి. సెప్టెంబర్ 9,10 తేదీల్లో జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టి ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో మరో 8 ఎఫ్-15ఈ జెట్లకు స్వల్ప నష్టం వాటిల్లింది.
ఇక, ఇరాన్‌లో అమెరికా సైన్యం వినియోగిస్తున్న ఆయుధాల ఖర్చు కేవలం నెల రోజుల్లోనే 6 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. సెంట్రల్ కమాండ్ అంచనాల ప్రకారం ఈ మొత్తం 28.1 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే.. సీఆర్ఎస్ రిపోర్టుపై వైట్‌హౌస్, పెంటగాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
