"వాళ్లే మమ్మల్ని రానివ్వకుండా ఆపుతున్నారు!".. ఎలాన్ మస్క్ పై కేంద్ర ప్రభుత్వం ఫైర్

 "వాళ్లే మమ్మల్ని రానివ్వకుండా ఆపుతున్నారు!".. ఎలాన్ మస్క్  పై కేంద్ర ప్రభుత్వం ఫైర్

భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించాలనుకుంటున్న ఎలాన్ మస్క్ కంపెనీ 'స్టార్‌లింక్' (Starlink),  కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కాకుండా కొందరు ధనవంతులు   అడ్డుపడుతున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించగా, ఆయన చేసిన వ్యాఖ్యలు నిజం కాదని, తప్పుగా అర్థం చేసుకున్నారని... కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది.

 భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ త్వరగా అందుబాటులోకి రావాలని, ముఖ్యంగా ఇంటర్నెట్ సరిగ్గా లేని ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్‌పై ఎలాన్ మస్క్ స్పందించారు.

 "దురదృష్టవశాత్తు, భారత ప్రజలపై వారి ఆధిపత్యం కాపాడుకోవడానికి కొందరు ధనవంతులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వారు ఎవరో మీరు ఈజీగా ఊహించొచ్చు. ఇది భారత ప్రజలకు చేస్తున్న పెద్ద అన్యాయం!".....  వాళ్ళ మార్కెట్‌ను కాపాడుకోవడానికి టెలికాం దిగ్గజాలే (జియో, ఎయిర్‌టెల్ వంటివి) స్టార్‌లింక్‌ను రాకుండా ఆపుతున్నాయని ఎలోన్ మస్క్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం సమాధానం
ఎలోన్ మస్క్ పేరు ప్రస్తావించకుండానే, ఆయన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ల కోసం ఏర్పాటు చేసిన నిబంధనలు అందరికీ సమానంగా, నిష్పక్షపాతంగా ఉంటాయని స్పష్టం చేసింది.

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో  స్పేస్‌ఎక్స్ (స్టార్‌లింక్)తో పాటు, భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన 'వన్ వెబ్' (Eutelsat OneWeb), ఇంకా 'జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్' (Jio Satellite) కంపెనీలకు కూడా ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేసింది.

ఈ మూడు కంపెనీలూ భారతీయ ప్రజల డేటా భద్రతకు, దేశ భద్రతకు సంబంధించిన నియమాలను పాటించాల్సిందే. ప్రస్తుతం మూడు కంపెనీల భద్రతా తనిఖీలు ఒకే దశలో జరుగుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ప్రత్యేకం లేదా వివక్ష చూపడం లేదు. నిబంధనల అమలులో అన్యాయం జరుగుతోందనడం ముమ్మాటికీ నిజం కాదు. 

మరోవైపు, ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో మాట్లాడిన స్టార్‌లింక్ ఉపాధ్యక్షురాలు లారెన్ డ్రేయర్, మేము భారత భద్రతా నియమాలకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. భారతదేశంలో సేవల కోసం ఇప్పటికే 20 గేట్‌వే సైట్లను, వందల యాంటెనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన మరుక్షణమే సేవలు ప్రారంభించడానికి రెడీగా ఉన్నామని వెల్లడించారు.

స్టార్‌లింక్‌కు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ (GMPCS) లైసెన్స్ వచ్చిన, వాణిజ్యపరంగా ఇంటర్నెట్ సేవలు అందించడానికి చివరి  అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం అన్ని కంపెనీలను ఒకేలా చూస్తున్నామని స్పష్టం చేసింది.