కూకట్ పల్లి: బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ పైపుల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. పక్కనే వెళుతున్న స్కూటీపై ఐరన్ పైపుల లోడ్ పడింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే రెండ్రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో కూడా జరిగింది. ఓ కుటుంబం బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో భార్యాభర్తలతో పాటు వారి ఆరేండ్ల కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. కూతురు గాయాలతో బయటపడింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు(36), ఆయన భార్య సావిత్రి (30), ఆరేండ్ల కొడుకు ధనుష్, తొమ్మిదేండ్ల కూతురు బైక్పై చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామంలో మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
చీకటి పడ్డాక తిరిగి వెళుతుండగా చేవెళ్ల మండలం గొల్లపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధు, సావిత్రి, ధనుష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. పాప గాయపడడంతో చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
