ఇరాన్తో ఆర్థిక బంధం తెంచుకోండి..లేదంటే డాలర్ సిస్టం నుంచి బహిష్కరణే.. ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్

ఇరాన్తో ఆర్థిక బంధం తెంచుకోండి..లేదంటే డాలర్ సిస్టం నుంచి బహిష్కరణే.. ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్

వాషింగ్టన్: ఇరాన్ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీసేందుకు చేపట్టిన ‘ఎకనామిక్ డి–డే’ ఆపరేషన్ ను అమెరికా తీవ్రం చేసింది. ఇప్పటికే ఇరాన్​పై విధించిన ఆంక్షలకు తోడు త్వరలో మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొంది. ఇరాన్ ను డాలర్ వ్యవస్థ నుంచి తప్పించడంతో అంతర్జాతీయ వ్యవహారాలకు ఆ దేశం విదేశాలపై ఆధారపడుతోంది. మనీలాండరింగ్ వ్యవహారాలతో చమురు లావాదేవీలను పూర్తిచేస్తోంది. ప్రస్తుతం అమెరికా దీనిపై దృష్టి సారించింది. ఇరాన్ తో ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు కొనసాగించవద్దని, ఇప్పటికే జరుపుతున్న లావాదేవీలను రద్దు చేసుకోవాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. లేదంటే ఇరాన్ లానే ఆయా దేశాలను కూడా అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి బహిష్కరిస్తామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. ఈ విషయంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​ఇప్పటికే వివిధ దేశాధినేతలకు ఫోన్లు చేస్తూ వివరిస్తున్నారని తెలిపారు.

ఐదు ప్రధాన రంగాలపై ఆంక్షల విస్తరణ

టెహ్రాన్ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చే ఐదు కీలక రంగాలపై ఈ కొత్త ఆంక్షలు విస్తరించాయి. ఇందులో డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం మరియు సముద్ర రవాణా రంగాలు ఉన్నాయి. కాగా, అమెరికా తీసుకొచ్చిన ఈ కఠినమైన ద్వితీయ ఆంక్షల కారణంగా చైనా, తుర్కియే, యూఏఈ వంటి దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా విధిస్తున్న కఠినమైన దిగ్బంధం, ఆర్థిక దండయాత్ర కారణంగా ఇరాన్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ఆ దేశ కరెన్సీ ‘రియాల్’ విలువ రికార్డు స్థాయిలో పడిపోయి, ఒక యూఎస్ డాలర్‌‌కు ఏకంగా 20.2 లక్షల స్థాయికి దిగజారింది.