జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..రేవంత్ చెప్పిన ప్రజాపాలన ఇదేనా?: హరీశ్ రావు

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..రేవంత్ చెప్పిన ప్రజాపాలన ఇదేనా?: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదుగానీ, 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆగమేఘాల మీద విడుదల చేస్తోందని సోమవారం ఒక పత్రిక ప్రకటనలో మండిపడ్డారు. ‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రజాపాలన?’ అని నిలదీశారు. 

యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని ప్రభుత్వానికి మద్యం వ్యాపారంపై మాత్రం ఇంత తొందర ఎందుకని ప్రశ్నించారు. యువత డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం చూస్తుంటే.. ప్రభుత్వం మద్యం షాపులు, బ్రాండ్లు పెంచి డబ్బు వసూలు చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు.“2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మోసం.. ఫీజు రీయింబర్స్‌‌మెంట్ మోసం.. రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడిపోయింది. మేనిఫెస్టోలో చెప్పిన హామీలకు గతి లేకుండా పోయింది. రేవంత్ పగ.. యువత దగా అన్నట్లుగా తయారైంది” అని హరీశ్ రావు విమర్శించారు.