- గడువులోగా మరాఠీ నేర్చుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దుచేస్తామని వార్నింగ్
- నోటీసులను వ్యతిరేకిస్తూ మూడు రోజుల సమ్మెకు దిగిన డ్రైవర్లు
ముంబై: మహారాష్ట్రలో మరాఠీ భాషా వివాదం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రంలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు మరాఠీ మాట్లాడటం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనను పాటించని వారికి రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది.ఒక నెల వ్యవధిలోగా మరాఠీ నేర్చుకోవాలని..లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దు వంటి చర్యలు ఉంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ చర్యలను వ్యతిరేకిస్తూ ముంబైలో ఆటో-, ట్యాక్సీ డ్రైవర్లు సోమవారం నుంచి మూడు రోజుల సమ్మెను ప్రారంభించారు. ప్రధానంగా ముంబై, ఎంఎంఆర్, కండివాలి ప్రాంతాలతోపాటు పలు ఏరియాల్లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది.
చాలా మంది డ్రైవర్లకు మరాఠీ సరిగ్గా రాదని, వయసు మళ్లినవారు, చదువు తక్కువగా ఉన్నవారు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా భాషను నేర్చుకోవడం కష్టంగా ఉందని ఆటో-, ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. లాంగ్వేజ్ పరీక్షలో ఫెయిలైతే రూ.15 వేల నుంచి రూ.20 వేలు వరకు ఫైన్ వేస్తామనడం దారుణమన్నారు. ఇది తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. మరాఠీ నేర్చుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జరిమానాలపై సమీక్ష జరపాలని..లైసెన్సులు, పర్మిట్లకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలామంది మరాఠి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.మరాఠీ నేర్చుకునేందుకు ఆర్థిక, జీవనోపాధి సంబంధిత పరిణామాలను ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాష నేర్చుకోకపోతే తీసుకోబోయే చర్యలను వెంటనే విరమించుకోవాలని రిక్వెస్ట్ చేశారు.
డ్రైవర్లకు పరీక్ష పెట్టేది ఆర్టీవో ఆఫీసర్లే
మరాఠీ తప్పనిసరి రూల్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఆర్టీవో అధికారులు డ్రైవర్లకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్లు రోజూ ప్రయాణికులతో మాట్లాడే సాధారణ విషయాల గురించే ప్రశ్నలు అడుగుతారు. "ఎక్కడికి వెళ్లాలి?" అని మరాఠీలో అడగడం లేదా చెప్పడం, ప్రయాణానికి ఎంత ఛార్జీ అయ్యిందో ప్యాసింజర్ కు మరాఠీలో చెప్పడం, మీటర్ గురించిన విషయాలు మాట్లాడాలి. రోజువారీ ప్రయాణంలో ప్రయాణికులతో ఎదురయ్యే చిన్న చిన్న మాటలను డ్రైవర్లు మరాఠీలో మాట్లాడగలరా లేదా అని మాత్రమే అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, పరీక్షలో ఫెయిలైన వెంటనే డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయబోమని, భాష నేర్చుకోవడానికి నెల రోజుల అదనపు సమయం ఇస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే సుమారు 1.65 లక్షల మంది డ్రైవర్లు మరాఠీ శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు పొందినట్లు సమాచారం.
భాష పేరుతో అన్యాయం జరగదు: సీఎం ఫడ్నవీస్
మరాఠీ నేర్చుకోవాలనే నిబంధనపై జరుగుతున్న వివాదం, ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సమ్మెపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మరాఠీ నేర్చుకోవాలన్న అంశాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని తెలిపారు. భాష పేరుతో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. ఆటో-రిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయడం లేదని చెప్పారు. డ్రైవర్లకు మరాఠీ నేర్చుకోవడానికి గడువును పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డ్రైవర్లు తమ ప్యాసింజర్లతో మాట్లాడేందుకు అవసరమైన మరాఠా మాత్రమే నేర్చుకోవాలని ప్రభుత్వ ఆశిస్తోందన్నారు.
