ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కమిటీల పాత్ర కీలకం : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కమిటీల పాత్ర కీలకం : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
  •   అసెంబ్లీలో ఎస్సీ, మైనార్టీ సంక్షేమ కమిటీల సమావేశం

హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ కమిటీల పాత్ర ఎంతో కీలకమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మైనార్టీ, ఎస్సీ సంక్షేమ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా చూడడంలో కమిటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గాల విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమం వంటి అంశాలపై కమిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. 

ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఈ కమిటీలు నిరంతరం పనిచేయాలన్నారు. ఎస్సీల ప్రాథమిక అవసరాలను గుర్తించి, దానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. కమిటీ సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మైనార్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ లక్ష్మీకాంతారావు, ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం తదితర సభ్యులు పాల్గొన్నారు.