న్యూఢిల్లీ: భారత్ గత ఏడాది మే నెలలో నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ‘మర్కజ్ సుభాన్ అల్లా’ పునర్నిర్మాణం పూర్తయింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ శిబిరాన్ని కొత్త మార్బుల్స్, తాజా పెయింట్లు, ప్లాస్టరింగ్‌తో పూర్తిగా పునరుద్ధరించారు. దెబ్బతిన్న డోమ్‌లను తిరిగి నిర్మించారు.
సెంట్రల్ హాల్‌లో ఏర్పడిన గుంతలను పూడ్చి, నిర్మాణాన్ని పునరుద్ధరించడం ద్వారా ఆపరేషన్ సిందూర్ దాడుల తాలూకు ఆనవాళ్లను పూర్తిగా కప్పిపుచ్చారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. ఈ క్యాంపు పునర్నిర్మాణం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం విడతల వారీగా రూ.25 కోట్ల నగదును జైషే మహ్మద్‌కు అందించింది. ఇందులో సుమారు రూ.11 కోట్లను ప్రత్యేకంగా సెంట్రల్ హాల్ పునర్నిర్మాణానికే వెచ్చించారు.
ప్రధాన సముదాయానికి ఆనుకుని ఉన్న మదర్సా అల్-సాబిర్, జైషే కమాండర్లు నివసించే క్వార్టర్స్‌తో పాటు దెబ్బతిన్న ఇతర నిర్మాణాలను తొలగించి, ఆ స్థానంలో కొత్త నిర్మాణాలను చేపట్టారు. కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (పీవోకే) టెర్రర్ క్యాంపులపై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో సరిహద్దుల్లో భారీ సంఖ్యలో టెర్రర్ క్యాంపులను సైన్యం తుడిచిపెట్టేసింది.
శాటిలైట్ చిత్రాలతో వెలుగులోకి..
భారత బలగాల దాడిలో దెబ్బతిన్న స్థావరాలను టెర్రర్ సంస్థలు పునర్నిర్మించుకోవడం ప్రారంభించాయని ఈ ఏడాది ఏప్రిల్‌లో శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడింది. ‘మర్కజ్ సుభాన్ అల్లా’ క్యాంపు వద్ద భారీ యంత్రాలు, నిర్మాణ వాహనాలు కనిపించినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ టెర్రర్ క్యాంపును మళ్లీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు జియో-ఇంటెలిజెన్స్ పరిశోధకులు తెలిపారు.
తాజా శాటిలైట్ చిత్రాలతో టెర్రర్ క్యాంపు పునర్నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది. పునర్నిర్మాణ పనుల కోసం ఈ టెర్రర్ గ్రూప్ విరాళాలు సేకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇంటర్నేషనల్ బార్డర్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మర్కజ్ సుభాన్ అల్లా’ స్థావరాన్ని టెర్రరిస్టుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్ కోసం జైషే ఉపయోగిస్తోంది. ‘ఉస్మాన్- ఓ- అలీ’ క్యాంపస్‌గా పిలిచే ఈ 18 ఎకరాల్లో ఒక మసీదు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఈ స్థావరం లాహోర్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాక్ ఆర్మీ కంటోన్మెంట్‌కు అత్యంత సమీపంలోనే ఉండడం గమనార్హం.
