వాషింగ్టన్: వాణిజ్య చర్చలు బెడిసికొట్టడంతో కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికాలో ఒక రాష్ట్రంగా చేరకున్నా, రాష్ట్రానికి దక్కే అన్ని లాభాలు కావాలా..? అంటూ కెనడాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా కెనడా తమ దేశ రైతులపై సుంకాలు విధిస్తూ దోచుకుంటోందని, ఇకపై ఆ పప్పులు ఉడకవంటూ ‘ట్రూత్ సోషల్’ వేదికగా హెచ్చరించారు. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా దిగుమతులపై 50 శాతం సుంకాలను అమెరికా విధించింది.
దాడి జరిగితే యుద్ధమే: కెనడా ప్రధాని
అమెరికా నిర్ణయాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘మనపై దాడి జరిగితే అది యుద్ధమే అవుతుంది. అమెరికా మాపై ఆర్థిక దాడి చేసింది’’ అని స్పష్టం చేశారు. తమ దేశ రైతులు, కార్మికులు, పరిశ్రమలను కాపాడుకునేందుకు అమెరికాకు ‘డాలర్‌కు డాలర్’ రూపంలో దీటుగా బదులిస్తామన్నారు. సెప్టెంబర్ 8 నుంచి యూఎస్ ఉక్కు, డెయిరీ, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ పరికరాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని తేల్చిచెప్పారు. అమెరికా చివరి నిమిషంలో పెట్టిన అన్యాయమైన షరతుల వల్లే చర్చలు ఆగిపోయాయని ఆరోపించారు.
ట్రక్కుల పంచాయితీతోనే రచ్చ
వాహనాలు, ఉక్కు, అల్యూమినియం రంగాలపై సుంకాలు తగ్గించేందుకు రెండు దేశాలు తొలుత ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ.. ట్రక్కులు, భారీ వాణిజ్య వాహనాలపై కూడా సుంకాలు తగ్గించాలని కెనడా పట్టుబట్టింది. సాధారణ కార్ల టారిఫ్‌ను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడానికి యూఎస్ అంగీకరించినా, భారీ వాహనాల రాయితీకి ససేమిరా అనడంతో చర్చలు పూర్తిగా రద్దయ్యాయి.
