టెన్నెస్సీలో వ్యాపారి.. న్యూయార్క్‎లో డెలివరీ బాయ్.. అమెరికాలో ఇద్దరు ఇండియన్ల హత్య

టెన్నెస్సీలో వ్యాపారి.. న్యూయార్క్‎లో డెలివరీ బాయ్.. అమెరికాలో ఇద్దరు ఇండియన్ల హత్య

జాక్సన్‌‌‌‌: చోరీ చేసేందుకు తుపాకీ పట్టుకుని స్టోర్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఓ దుండగుడు డబ్బులు కావాలని బెదిరించాడు. ఆపై అందినకాడికి తీసుకుని ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపాడు. దీంతో కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇండియన్‌‌‌‌ వ్యాపారి స్పాట్‌‌‌‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఈ నెల 20న ఈ దారుణం జరిగింది. మృతుడు 56 ఏండ్ల సురేశ్‌‌‌‌ పటేల్‌‌‌‌ స్వస్థలం.. గుజరాత్‌‌‌‌లోని మెహనాసా జిల్లా అని అధికారులు తెలిపారు. 

కాల్పులు జరిగిన టైంలో సురేశ్‌‌‌‌ పటేల్‌‌‌‌ పక్కనే ఉన్న ఆయన19 ఏండ్ల కూతురు షాక్‌‌‌‌కు గురయ్యారని చెప్పారు. ఈ ఘటనలో స్టోర్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న 70 ఏండ్ల మహిళా ఉద్యోగి కిందపడటంతో మణికట్టు విరిగిందని వెల్లడించారు. కాగా, గత 30 ఏండ్లుగా అమెరికాలో ఉంటున్న పటేల్.. ఇటీవలే షికాగో నుంచి జాక్సన్ సిటీకి మకాం మార్చారు. వారం రోజుల కిందే ‘రిడ్జ్‌‌‌‌క్రెస్ట్‌‌‌‌ సెల్లర్స్‌‌‌‌’ పేరుతో స్టోర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. 

‘‘గురువారం రాత్రి టైంలో దుండగుడు షాపులో చొరబడి, తుపాకీతో బెదిరించి డబ్బులు గుంజుకున్నాడు. ఆపై కాల్పులు జరిపి కారులో పరారయ్యాడు” అని పోలీసులు తెలిపారు. పెయింట్‌‌‌‌బాల్‌‌‌‌ తరహా మాస్క్‌‌‌‌ వేసుకుని వచ్చిన దుండగుడి ఫొటోలను విడుదల చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

న్యూయార్క్‌‌‌‌లో డెలివరీ బాయ్‌‌‌‌ హత్య

పిజ్జా డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన పంజాబ్‌‌‌‌కు చెందిన 28 ఏండ్ల యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఆ యువకుడు స్పాట్‌‌‌‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని పంజాబ్‌‌‌‌లోని కపుర్తలా జిల్లా జబ్బోవాల్‌‌‌‌ గ్రామానికి చెందిన గుర్దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌గా గుర్తించారు. న్యూయార్క్‌‌‌‌ నగరంలోని రిచ్‌‌‌‌మండ్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌ ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేస్తుండగా దోపిడీకి యత్నించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

గుర్దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ 13 ఏండ్ల కింద అప్పు చేసి అమెరికా వెళ్లాడు. అక్కడే ఉంటూ రాత్రింబవళ్లు పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడని అతడి తండ్రి ప్యారా లాల్‌‌‌‌ కన్నీరుమున్నీరయ్యారు. భవిష్యత్తు బాగుండాలని భారీగా అప్పు చేసి అమెరికా వెళ్లిన తమ కొడుకు ఇలా దుర్మరణం చెందడం తట్టుకోలేకపోతున్నామని అన్నారు. కాగా, గుర్దీప్‌‌‌‌కు ఇంకా పెండ్లి కాలేదు. అతడి సోదరుడితో కలిసి తండ్రి పంజాబ్‌‌‌‌లోనే డీజేగా పనిచేస్తున్నారు.