- ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలి: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను పసిపాపను కాపాడుకున్నంత జాగ్రత్తగా సంరక్షించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘ప్రత్యేక వన మహోత్సవాన్ని’ విజయవంతం చేయాలని సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, అటవీశాఖ ఉన్నతాధికారులతో ఆమె జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో 2026 వన మహోత్సవ సీజన్‌లో మొత్తం 16.06 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు మంత్రికి వివరించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా లక్ష్య సాధనలో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. సెప్టెంబర్ నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేసేలా పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు. మొక్కల పెరుగుదల, సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
