- అర్హులైన ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా చూడండి: మహేశ్ గౌడ్
- కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు సాధిస్తామని వెల్లడి
మెదక్, వెలుగు: కాంగ్రెస్‌కు ఓటేస్తారన్న ఉద్దేశంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. సోమవారం మెదక్‌లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ పేరుతో పనికిరాని షరతులు పెట్టి పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రాంతాల వారీగా 10 నుంచి 40 శాతం వరకు ఓట్ల తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని, నోటీసులు వచ్చిన ఓటర్లు సరైన పత్రాలు సమర్పించేలా చూడాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు అప్పగిస్తూ ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తోందని ఆరోపించారు. క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదని, పప్పు, ఉప్పు, చక్కెర లాంటి నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయన్నారు. జెన్ జీ ఉద్యమం మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఎప్పడు ఎలక్షన్ జరిగినా మోదీ ఇంటికి పోకతప్పదని జోస్యం చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన దోపిడీ, అరాచక పాలన ప్రజలు మరచిపోయారనే భ్రమలో హరీశ్ రావు ఉన్నారని, ఆ దుష్టపాలనను ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారని చెప్పారు.
అసెంబ్లీకి రాని నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు?
ప్రతిపక్ష హోదా, జీతభత్యాలు తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని, అసెంబ్లీకి రానప్పుడు ఆయనకు ఆ హోదా ఎందుకని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. సోషల్ మీడియా దొంగ మాటలు, మార్ఫింగ్ వీడియోల మీద కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలకు సొసైటీ, మార్కెట్, టెంపుల్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో 70 శాతం వారికే దక్కుతాయని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్‌లో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, అలాగని పరిధి దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు ఐదు లక్షల ఓట్లు పోతున్నాయని, క్లెయిమ్, నోటీసుల విషయంలో బీ ఎల్ ఏ లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ రావు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
