4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.. అమెరికా పర్యటన రద్దుపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.. అమెరికా పర్యటన రద్దుపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
  • ఇది రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే కుట్ర
  • పర్యటనకు బ్రేక్ వేసినా.. లక్ష్యాన్నిఅడ్డుకోలేరు
  • గుజరాత్ సీఎం విదేశీ పర్యటనలు ఎందుకాపలే?
  • పీఎం మోదీ ఆ రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడరా?
  • మీరెవరి అనుమతితో పాక్ వెళ్లి బిర్యానీ తిన్నరు?
  • ప్రధానిని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • కేంద్రం తీరు ఫెడరల్ ​స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్య
  • బీజేపీ కార్యకర్తలా విదేశాంగ శాఖ అధికారి తీరు
  • ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షే
  • పార్లమెంటు ఉభయ సభల్లోనూ నిలదీస్తం
  • మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువత భవిష్యత్తు కోసం  ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తన అమెరికా అధికారిక పర్యటనను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే అడ్డుకున్నదని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు.  సీఎం పర్యటనను అడ్డుకోవడమంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాలరాయడమేనని మండిపడ్డారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ  పంపిన పత్రాలను  ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. 

‘‘కేంద్రం అనుమతి నిరాకరించడం కేవలం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వ్యక్తిగత పర్యటనకు ఎదురైన అడ్డంకి కాదు.. తెలంగాణ  ప్రగతిని, ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ పెట్టుబడులను తొక్కిపెట్టేందుకు సాగిస్తున్న తీవ్రమైన కుట్ర. సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కా సాథ్.. సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కా వికాస్ అనే నినాదం కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకేనా? దేశ ప్రధాని నరేంద్ర మోదీ యావత్ భారతదేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారా? లేదంటే గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారా?’’ అని నిలదీశారు.

విదేశాంగ శాఖలోని ఆ అధికార ప్రతినిధి ఒక బాధ్యతాయుతమైన అధికారిగా కాకుండా బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని, ఆయనకు అంతగా రాజకీయాలు మాట్లాడాలని ఉంటే ఎంఈఏ అధికారి పదవిని వదిలేసి.. నేరుగా బీజేపీలో చేరిపోవడం మంచిది అని ఫైర్​ అయ్యారు. ఈ అప్రజాస్వామిక 
నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉభయ సభలైన లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ, రాజ్యసభల్లో కేంద్రాన్ని  నిలదీసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు ప్రతిష్టా త్మక విద్య, క్రీడా రంగాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే ఈ విదేశీ పర్యటనను రూపొందించినట్టు సీఎం రేవంత్‌‌రెడ్డి వివరించారు. రాబోయే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా అత్యంత వైభవంగా ‘తెలంగాణ రైజింగ్-2047’ గ్లోబల్ ఇన్వెస్ట్‌‌మెంట్ సమిట్‌‌ను నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.

ఈ సదస్సుకు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు, ఆక్స్‌‌ఫర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌‌లాంటి విద్యా సంస్థలను, అంతర్జాతీయ స్పోర్ట్స్ అకాడమీలను, భారీ ఎంఎన్‌‌సీ సంస్థలను ప్రత్యక్షంగా ఆహ్వానించేందుకే తాము యూకే, యూఎస్ పర్యటనను ఖరారు చేసుకున్నామని స్పష్టం చేశారు.

‘‘తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య, క్రీడా మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ టూర్ షెడ్యూల్ చేశాం. యూకేలో పర్యటించి అక్కడి వర్సిటీలతో ఎంవోయూలు చేసుకునేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. సరిగ్గా అదే ఉద్దేశంతో తలపెట్టిన అమెరికా పర్యటనను మాత్రం ఎందుకు నిరాకరించింది? ఒక  సీఎం తన రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడుల సమీకరణకు వెళ్తుంటే మోకాలడ్డటం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?’’ అని ప్రశ్నించారు.  

నిర్దేశిత ఫార్మాట్‌‌లోనే షెడ్యూల్​ 

నిర్దేశిత ఫార్మాట్‌‌ ప్రకారం అధికారిక పర్యటన షెడ్యూల్, ఆహ్వానాలు, ఉద్దేశాలను స్పష్టంగా ఎంఈఏకు సమర్పించినప్పటికీ.. కనీస సహేతుక కారణం కూడా చూపకుండా ఏకపక్షంగా తిరస్కరించారని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎంఈఏ పంపిన డాక్యుమెంట్‌‌లో కేవలం పొలిటికల్ యాంగిల్‌‌లో క్లియరెన్స్ తిరస్కరించబడింది  అని ఒక్క లైన్ రాసి చేతులు దులుపుకున్నారు.

అసలు ఆ పొలిటికల్ యాంగిల్ అంటే ఏమిటి? నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినైనా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అమెరికా వెళ్తున్నానని స్పష్టంగా చెప్పాం. మా ప్రతిపాదనలో ఏవైనా లోపాలున్నా, అదనపు సమాచారం కావాలన్నా అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఎలాంటి కారణం లేకుండా పొలిటికల్ రీజన్ అని తిరస్కరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందకూడదనే సంకుచిత రాజకీయ భావజాలం తప్ప ఇందులో మరొకటి లేదు’’ అని మండిపడ్డారు.

ఇది ముమ్మాటికీ వివక్షే.. 

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒక న్యాయం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మరో న్యాయమా? అని సీఎం రేవంత్‌‌ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గత వారం రోజులుగా కెనడా, అమెరికా దేశాల్లో యథేచ్ఛగా పర్యటిస్తూ రోడ్‌‌షోలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘గుజరాత్ సీఎం ఏకంగా 8 రోజులపాటు అమెరికా, కెనడాలో పర్యటించి ‘వైబ్రెంట్ గుజరాత్-2047’ పేరుతో పెట్టుబడుల కోసం రోడ్‌‌షోలు నిర్వహిస్తే కేంద్ర విదేశాంగ శాఖ ఎర్ర తివాచీ పరిచి వెంటనే అనుమతులు మంజూరు చేసింది.

 అదే తెలంగాణ సీఎం ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో గ్లోబల్ సమిట్ కోసం పెట్టుబడులు తేవడానికి వెళ్తుంటే నిరాకరిస్తారా? తెలంగాణకు పెట్టుబడులు వస్తే ఎక్కడ గుజరాత్‌‌కు రాకుండా పోతాయోనన్న భయంతోనే కేంద్ర పెద్దలు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ప్రధాని, గుజరాత్ సీఎం ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారన్న కారణంతో ఇతర రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రాంతీయ వివక్షే’’ అని అన్నారు. 

కేంద్రం కేవలం విదేశీ పర్యటనలనే కాకుండా, గత 30 నెలలుగా తెలంగాణ ప్రగతికి సంబంధించిన ప్రతి కీలక ప్రాజెక్టునూ కావాలనే తొక్కిపెడుతోందన్నారు.  ట్రిపుల్‌‌ ఆర్‌‌‌‌, మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం, వివక్ష ప్రదర్శిస్తోందని తెలిపారు.  ‘‘గత కొన్ని నెలలుగా నేను గమనిస్తున్నాను. తెలంగాణ అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రానికి ఏమాత్రం మనస్కరించడం లేదు. అది  ట్రిపుల్‌‌ ఆర్‌‌‌‌ కావ చ్చు, మెట్రో రైలు ప్రాజెక్టు కావచ్చు, మరే ఇతర అభివృద్ధి పనులైనా కావచ్చు.. ప్రధాని మోదీ కేవలం గుజరాత్‌‌కు మాత్రమే రాయబారిగా ఆలోచిస్తూ తెలంగాణ పురోగతికి మోకాలడ్డుతున్నారు’’ అని మండిపడ్డారు.  

మాయా టూడోర్‌‌‌‌తో భేటీ అయితే కేంద్రానికెందుకు భయం..?

తన పర్యటన,  భద్రత, విదేశీ ప్రతినిధుల కలయికలపై వస్తున్న తప్పుడు ప్రచారాలను సీఎం రేవంత్‌‌రెడ్డి ఖండించారు. సీఎం స్థాయి వ్యక్తి అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమం, షెడ్యూల్ భారత రాయబార కార్యాలయం (హైకమిషన్, ఎంబసీ) పర్యవేక్షణలోనే అమలవుతుందని స్పష్టం చేశారు. న్యూయార్క్ నగర ప్రజాప్రతినిధులు, ఆక్స్‌‌ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ మాయా టూడోర్‌‌‌‌లాంటి ప్రముఖులతో ములాఖత్‌‌లపై స్పందించారు.

  ‘‘ఒక సీఎం ఎక్కడికి వెళ్లినా భారత దౌత్య కార్యాలయాలే అపాయింట్‌‌మెంట్లు, భద్రత, ప్రొటోకాల్‌‌ను ఖరారు చేస్తాయి. మేయర్ కావచ్చు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కావచ్చు.. అధికారికంగా వ్యవస్థల ద్వారానే అన్నీ జరుగుతాయి. ఏదో గల్లీలో తిరిగినట్టు పోయి కలవడానికి  కార్పొరేటర్‌‌ కాదు కదా ? కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.  పర్యటనలో భాగంగా ఆక్స్‌‌ఫర్డ్ ప్రొఫెసర్ మాయా టూడోర్, న్యూయార్క్ ప్రజాప్రతినిధి జొహ్రాన్ మమ్దానీలాంటి ప్రముఖులను కలవాలని నిర్ణయించడంపై కేంద్రం, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్‌‌రెడ్డి స్పందించారు.  

మాయా టూడోర్ అంతర్జాతీయ స్థాయి విద్యావేత్త అని, 1975–76 ఎమర్జెన్సీ కాలంతోపాటు 2014 తర్వాత మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం క్షీణిస్తున్న తీరుపై ఆమె రాసిన విశ్లేషణాత్మక పరిశోధనా వ్యాసాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని  వివరించారు.  ‘‘ఆమెతో విద్యాపరమైన అంశాలపై భేటీ కావాలనుకుంటే కేంద్రం ఎందుకు భయపడుతోంది? విదేశాల్లో భారత్‌‌లో ప్రజాస్వామ్యం గురించి ఆమె రాసిన నిజాన్ని నేనూ సమర్థిస్తున్నాను. 2014 నుంచి మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేది వాస్తవం’’ అని స్పష్టం చేశారు.

 అలాగే ‘గతంలో వెళ్లారు కదా.. అప్పుడు ఇచ్చారు కదా ? ఇప్పుడు అమెరికా టూర్ మళ్లీ ఎందుకు?’ అని కొందరు అడుగుతున్న ప్రశ్నలపై సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘నిన్న టిఫిన్ చేశాం, లంచ్ చేశాం, డిన్నర్ చేశాం కదా అని ఈరోజు అన్నం తినడం మానేస్తామా? పెట్టుబడుల సాధన, పరిశ్రమల ఆహ్వానం అనేది నిరంతర ప్రక్రియ. ఏటా అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి పెట్టుబడులను రాబట్టాలి. 2026 తెలంగాణ గ్లోబల్ సమిట్ లక్ష్యంగా మేం ప్రణాళికలు రచిస్తుంటే.. చిల్లర రాజకీయాలతో రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయాలని చూడటం దుర్మార్గం’’ అని మండిపడ్డారు.

పాకిస్తాన్​ వెళ్లినప్పుడు మోదీకి నిబంధనలు అడ్డురాలేదా..?

గతంలో మోదీ ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రొటోకాల్ లేకుండా పాకిస్తాన్‌‌ వెళ్లి అక్కడి ప్రధానిని కలిసి బిర్యానీ తిని వచ్చిన సంగతి దేశ ప్రజలకు ఇంకా గుర్తుందని సీఎం పేర్కొన్నారు. ‘‘పాకిస్తాన్ ఏమైనా మన మిత్రదేశమా? మోదీ ప్రధాని హోదాలో ఎవరి అనుమతి అడిగి అకస్మాత్తుగా పాకిస్తాన్‌‌ వెళ్లి నవాజ్ షరీఫ్‌‌ను కౌగిలించుకొని వచ్చారు? నాటి విదేశాంగ విధానాలు, భద్రతా ప్రమాణాలు ఏమయ్యాయి? తెలంగాణ ప్రజలు ఓట్లేసి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే, వారు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాల్సింది పోయి సీఎం పర్యటనను అవహేళన చేయడం సిగ్గుచేటు. గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, హరీశ్‌‌రావు పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి, వారు విదేశీ పర్యటనలు చేయడానికి అనుమతులిచ్చిన కేంద్రం.. రాష్ట్ర అభివృద్ధికి నిధులు, పరిశ్రమలు తెచ్చేందుకు మేం వెళ్తుంటే ఎందుకు అడ్డుపడుతోంది?’’ అని నిలదీశారు.

తెలంగాణ హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తం

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదని, తెలంగాణ హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాకుండా అడ్డుపడడం ద్వారా తెలంగాణ ప్రగతి చక్రాలను ఆపలేరని హెచ్చరించారు. ‘‘మేము అధికారికంగా పారదర్శకమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నాం. తెలంగాణ పురోగతి కోసం అమెరికా పర్యటనను అడ్డుకున్న విషయాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతాం.

పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతాం. ప్రపంచంలో ఏ దేశమైనా భారత ప్రభుత్వ నిబంధనలకు లోబడే మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, పారిశ్రామిక పురోగతి కోసం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు సాగుతాం. కేంద్రం తన పక్షపాత వైఖరిని మార్చుకుని, రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి గౌరవం ఇవ్వకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’’ అని సీఎం రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు. 

క్రమ శిక్షణా కమిటీ పరిశీలనలో కొండా సురేఖ వ్యవహారం

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై మీడియా ప్రశ్నించగా సీఎం రేవంత్​ రెడ్డి స్పందించారు. ‘‘ఆ విషయం ప్రస్తుతం క్రమశిక్షణా కమిటీ పరిశీలనలో ఉంది. పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను ఎట్టిపరి స్థితుల్లోనూ మీడియా సమక్షంలో నేను చర్చించను’’ అని స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, వ్యవస్థాగత విధివిధానాలు ఉన్నాయని, ఎలాంటి సమస్యనైనా సంబంధిత కమిటీలే పరిష్కరిస్తాయని పేర్కొ న్నారు.

 ‘‘పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలన్నింటినీ పీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుంది. ఆయా కమిటీలు, అధిష్టానం తీసుకునే తుది నిర్ణయానికి పార్టీ, మేం, మీరు.. అందరం కట్టుబడి ఉండాల్సిందే. కాబట్టి ఎవరూ ఊహాజనితమైన అంశాలను అనవసరంగా ప్రస్తావించకండి’’ అని అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు సంస్థాగత నిబంధనలను గౌరవించాల్సిన అవసరం ఉందని,  అభూతకల్పనలు, ఊహాగానాలతో కూడిన వార్తలను ప్రసారం చేయవద్దన్నారు.